హైదరాబాద్: టెస్టులకు దినేష్ చండిమాల్, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఉపుల్ తరంగను కెప్టెన్లుగా నియమిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. జింబాబ్వేతో సొంతగడ్డపై వన్డే సిరిస్‌ను కోల్పోయిన నేపథ్యంలో ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ మూడు ఫార్మెట్ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు బుధవరం కొత్త కెప్టెన్లను ప్రకటించింది. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న చండీమాల్‌ను టెస్టు జట్టుకు, మాథ్యూస్ గైర్హాజరీతో వన్డే జట్టుకు సారథ్యం వహించిన ఉపుల్ తరంగను వన్డే, టీ20లకు కెప్టెన్లుగా నియమించింది.
ఈ మేరకు జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కి జట్టుని ప్రకటిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ టెస్టుకు చండీమాల్ కెప్టెన్‌గా తరంగ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

వీరిద్దరి కెప్టెన్సీలో జులై 26 నుంచి స్వదేశంలో భారత్‌తో జరిగే మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్‌ను ఆడనుంది. టెస్టు కెప్టెన్ దినేష్ చండీమాల్ 36 టెస్టులు ఆడి 8 సెంచరీలు 11 అర్ధ సెంచరీలతో 2,540 పరుగులు చేశాడు.
ఇక ఉపుల్ తరంగ లంక తరుపున 207 వన్డేలు ఆడి 14 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలతో 6,212 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో 27 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలతో 1,568 పరుగులు చేశాడు. ప్రస్తుతం జింబాబ్వే జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది.
ఈ పర్యటనలో భాగంగా ఆడిన ఐదు వన్డేల సిరిస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. జింబాబ్వేతో సిరీస్‌లో చివరి వన్డే ముగిసిన తర్వాత సిరీస్ ఓటమిపై మాథ్యూస్ విచారం వ్యక్తం చేశాడు.
జింబాబ్వే చేతిలో ఓడటాన్ని తన కెరీర్‌లోనే అత్యంత ఘోర పరాభవంగా చెప్పాడు. సెలెక్టర్లతో చర్చించి తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. జయవర్ధనే వారసుడిగా 2013లో జట్టు పగ్గాలు చేపట్టిన మాథ్యూస్ 34 టెస్టులు, 98 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అతని సారథ్యంలోనే గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను లంక క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఈ సీజన్‌లో అతను గాయంతో కీలకమైన సిరీస్‌లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టి20లకు, స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లకు అతను గైర్హాజరయ్యాడు.