బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చండిక హతురసింఘపై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కారణంగా అతన్ని కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రకటించింది. అతని స్థానంలో వెస్టిండీస్ క్రికెటర్ ఫిల్ సిమన్స్ కోచ్ బాధ్యతలు అందుకోనున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు సిమన్స్ కోచ్ పదవిలో కొనసాగనున్నాడు.
2023 వన్డే ప్రపంచకప్ సమయంలో ఓ ఆటగాడిపై భౌతిక దాడికి పాల్పడటం, చెంప చెల్లుమనిపించిన కారణాలతో హతురసింఘపై బీసీబీ కొరడా ఝుళిపించింది. సదరు ప్లేయర్‌పై కోచ్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక కాంట్రాక్ట్‌లో నిబంధనలకు మించి అత్యధిక సెలవులు పెట్టిన కారణంతోనూ హతురసింఘపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

హతురసింఘను తప్పించడంపై బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ మాట్లాడాడు. ''హతురసింఘపై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి రానుంది. అంతర్జాతీయ వ్యక్తి కావడంతో అతనికి 48 గంటల పాటు సస్పెన్షన్ వ్యవధి ఇచ్చాం. ఆ తర్వాత అతను కోచ్ పదవి నుంచి వైదొలగాల్సి ఉంది. హతురసింఘ వైఖరి గురించి పలు విషయాలు తెలిశాయి. బంగ్లాదేశ్ జట్టుకు అది ఏ మాత్రం మంచిది కాదు''
''2023 వన్డే వరల్డ్ కప్‌లో జరిగిన సంఘటన బయటకు రాలేదని మీడియా రాసుకొచ్చింది. దానిపై సమగ్ర విచారణ చేశాం. ఆ ప్లేయర్‌ను నేను కలిశాను. దాని గురించి పూర్తి వివరాలు తీసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఇదంతా భారత్‌తో సిరీస్ ముగిసిన అనంతరం జరిగింది. అంతేగాక కోచ్ హతురసింఘ మూడు నెలల కంటే ఎక్కువ సెలవులు పెట్టాడు'' అని ఫరూక్ అహ్మద్ తెలిపాడు. 2023 జనవరిలో హతురసింఘ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు.