సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా మార్చి 18(బుధవారం)న ప్రారంభం కానున్న తొలి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కుమార సంగక్కర ఈ వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగు సెంచరీలు సాధించి, అధ్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్ బుధవారం నాడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వరుసగా నాలుగు సెంచరీలు సాధించి చరిత్రను సృష్టించిన కుమార సంగక్కరపైనే అందరి కళ్లు ఉన్నాయి. 37ఏళ్ల కుమార సంగక్కర కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్నాడు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కుమార సంగక్కర ఐదవ సెంచరీ చేయాలని కోరుకుంటున్నారు.
అదే గనుక జరిగితే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసే అవకాశాన్ని కుమార సంగక్కరకి వస్తుంది. వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటి వరకు సచిన్ పేరిట ఉంది. సచిన్ 6 సెంచరీలు చేశాడు.
ఇప్పటి వరకు కుమార సంగక్కర తన కెరీర్‌లో వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు చేసి, ఆస్టేలియా రికీ పాంటింగ్‌ను సమం చేశాడు. సంగక్కర ఐసీసీ వరల్డ్ కప్ 2015లో ఏకంగా 4 సెంచరీలు చేయడం విశేషం. గత వరల్డ్ కప్స్‌లో మరొకటి మొత్తం 5.

ఇక సచిన్ టెండూల్కర్ తన 24ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 1992 నుంచి 2011 వరకు మొత్తం 6 వరల్డ్ కప్స్‌లో తన సత్తా చాటాడు. అధ్భుతమైన ఫామ్‌లో ఉన్న కుమార సంగక్కరను కట్టడి చేసేందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్స్‌లో దక్షిణాఫ్రికా ఒక్క క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా గెలవలేదు. కుమార సంగక్కర అదే ఫామ్‌ను కొనసాగిస్తే, చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుంది. వరల్డ్ కప్ ఆరంభానికి ముందు క్రికెట్ విశ్లేషకులు సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేయడం కష్టమని భావించారు. అయితే వారి ఆలోచనలు తప్పని కుమార సంగక్కర నిరూపించాడు.
అత్యధిక వరల్డ్ కప్ సెంచరీలు:
* సచిన్ టెండూల్కర్ (44 ఇన్నింగ్స్) - 6
* కుమార సంగక్కర (34 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్(42 ఇన్నింగ్స్) - 5
* ఎబి డి విల్లియర్స్ (21 ఇన్నింగ్స్), సౌరవ్ గంగూలీ (21 ఇన్నింగ్స్), మార్క్ వా (22 ఇన్నింగ్స్), తిలకరత్నే దిల్షాన్ (24 ఇన్నింగ్స్), మహేల జయవర్ధనే (33 ఇన్నింగ్స్) - 4