హైదరాబాద్: భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు మాజీ రంజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ బీఎండబ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చారు. హైదరాబాద్‌లోని గోపిచంద్ అకాడమీలో ఈ కారు బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చాముండేశ్వరీనాథ్ మీడియాతో మాట్లాడారు.
మిథాలీ ఒక గొప్ప క్రికెటర్ అని, ఆమె తన ఆటతో ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదిక జరిగిన మహిళల వరల్డ్ కప్‌లో మిథాలీ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరింది. ఈ సందర్భంగా మిథాలీ ఆటతీరుపై చాముండేశ్వరీనాథ్ ప్రశంసలు కురిపించాడు.
అనంతరం ఆమెకు బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా ఇస్తానని చెప్పాడు. తాను చెప్పినట్లే మంగళవారం గోపిచంద్ అకాడమీలో మిథాలీకి బీఎండబ్ల్యూ కారుని బహుకరించాడు. ఈ సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ తాను గోపీచంద్ అకాడమికి మొదటిసారి వచ్చానని, ఆయన ఎంతోమంది బ్యాడ్మింటన్ క్రీడాకారులను మన దేశానికి అందించారని పేర్కొంది.
మహిళల జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం వల్ల మహిళ క్రికెట్‌కు దేశంలో మంచి ఆదరణ వచ్చిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో తన జోరుని ఇలాగే కొనసాగిస్తానని మిథాలీ చెప్పింది. ఇక బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ వరల్డ్ కప్‌లో మిథాలీ రాజ్ భారత మహిళల జట్టుని ముందుండి నడిపించిందని కొనియాడారు. ఎంతో మంది క్రీడాకారులకు మిథాలీ ఆదర్శం అవుతున్నారని అన్నారు.
గతంలో 2007లో చెవర్లే కారును చాముండేశ్వరీనాథ్... మిథాలీకి బహుమానంగా ఇచ్చారు. గతేడాది రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన పీవీ సింధు, దీపా కర్మాకర్, సాక్షి మాలిక్‌లకు కూడా బీఎండబ్ల్యూ కార్లను బహుమానంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మిథాలీకి రూ. కోటి నగదుతో పాటు బంజారాహిల్స్‌లో 600 గజాల నివాస స్థలాన్ని మిథాలీకి కేటాయించారు. ఇక మిథాలీని ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా తీర్చి దిద్దిన కోచ్ మూర్తికి రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.