ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొంత మంది ప్లేయర్స్ ఎంపిక విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు తెలిసింది.
అసలేం జరిగిందంటే
వచ్చే నెల 6 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్, ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీంతో ఈ రెండిటి కోసం రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించారు. అయితే ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు మాత్రం అదనంగా పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం కల్పించారు. శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్ గా నియమించారు.

హార్దిక్ కు గంభీర్ సపోర్ట్
అయితే ఈ వైస్ కెప్టెన్ విషయమై గంభీర్ - రోహిత్ శర్మ - అజిత్ అగర్కాక్ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని సమాచారం అందింది. గంభీర్.. హార్దిక్ పాండ్యకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని అనుకున్నాడట. కానీ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గిల్‌ను ఉప సారథిగా ఎంచుకున్నారట.
సంజూకు గంభీర్ ఓటు
ఇక ముఖ్యంగా సంజూ శాంసన్ కు చోటు దక్కకపోవడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసిన సంజుకు జట్టులో చోటు దక్కకపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ వాస్తవానికి శాంసన్‌ను తీసుకోవాలని గంభీర్ అనుకున్నాడట.
అయితే రోహిత్, అగార్కర్.. శాంసన్ ను పక్కనపెట్టి పంత్ కు అవకాశం ఇచ్చారని సమాచారం. పైగా విజయ్ హజారే టోర్నీ కోసం కేరళ క్రికెట్ బోర్డు నిర్వహించిన క్యాంప్ కు సంజు వెళ్లకపోవడం సహా దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం వంటి కారణాలు శాంసన్ కొంపముంచాయని వాదనలు వినిపిస్తున్నాయి.