హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘోర పరాభవం తమకు తీవ్ర బాధ కలిగించిందని పాక్ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.
ఒకప్పుడు పాకిస్థాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్, షాహిద్ అఫ్రిది ట్విటర్‌లో తమ బాధను వ్యక్తం చేశారు. ఎడ్జిబాస్టన్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 41 ఓవర్లకు 289 పరుగుల లక్ష్యంగా కుదించారు.
అనంతరం లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 164 పరుగులకే పాకిస్థాన్ ఆలౌటైంది. 'భారత్, పాక్ జట్ల మధ్య దూరం ఎప్పుడూ లేనంత పెరిగింది. మనం చాలా వెనకబడ్డాం. ఆట పట్ల వైఖరి, నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటిలాగే ఉన్న స్ట్రయిక్ రొటేషన్, పేలవ డెత్‌బౌలింగ్ సమస్య పాక్‌ను తీవ్రంగా గాయపరిచింది' అని అఫ్రిది పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'ఓ ఆటగాడిగా గెలుపు ఓటములు అనేవి మ్యాచ్‌లో సహజం. అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పోరాడకుండానే ఓడిపోవడం బాధాకరం' అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
దేశంలో అపారమైన ప్రతిభ ఉందని, ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు. 'పాకిస్థాన్ క్రికెట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అలా చేయని పక్షంలో భారత్-పాక్ జట్లలోని ఆటగాళ్ల టాలెంట్ మధ్య అంతరం భారీగా పెరుగుతుంది' అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు.
అంతేకాదు భారత్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఇలాంటి తీవ్ర నిరాశాజనక పరాజయాలు ఎదురవుతూనే ఉంటాయని తెలిపాడు. ప్రొఫెషనల్ మెరిట్ ఆధారంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ని కూడా ఎంపిక చేయాలని కూడా ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సూచించాడు. మరోవైపు పాక్ అభిమానులు కూడా ఆ జట్టు ఆటతీరుపై గుర్రుగా ఉన్నారు. భారత్ చేతిలో ఇంత దారుణంగా ఓటమి పాలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.