Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం(నేడు) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. గ్రూప్ ఏలో రెండు జట్లు మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది.
భారత జట్టు ఈ టోర్నమెంట్ లో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు చేరుకున్నప్పటికీ.. కివీస్ జట్టు కూడా అంతే బలంగా ఉంది. గ్రూప్ దశలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై వరుసగా విజయాలు సాధించింది. భారత్ తో మూడో మ్యాచ్ లో మాత్రం ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడింది. కివీస్ జట్టు సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.

భారత జట్టు విజయాన్ని అడ్డుకునే ఆటగాళ్లు చాలా మంది న్యూజిలాండ్ జట్టులో ఉన్నారనేది వాస్తవం. రచిన్ రవీంద్ర ఫామ్ ను పరిశీలిస్తే.. అతను మిడిలార్డర్ లో భారత్ ను వెంటాడే అవకాశం ఉన్న ఆటగాళ్లలో ఒకడు. బౌలింగ్ విషయానికొస్తే.. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 10 ఓవర్ల స్పిన్ మాయజాలం న్యూజిలాండ్‌కు ప్లస్ కావచ్చు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై భారత్ ఓడిపోతే ఏం జరుగుతుందనేది విశ్లేషిద్ధాం.
భారత్ ఓడిపోతే..
ప్రైజ్ మనీ
న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ భారత్ గెలిస్తే.. ప్రైజ్ మనీ కింద రూ.19.45 కోట్లు దక్కనుంది. ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిస్తే.. రూ.9.72 కోట్లు లభించనుంది. విజేతకు, రన్నరప్ జట్టుకు మధ్య రూ.10 కోట్ల తేడా ఉంటుంది. ఈ క్రమంలో భారత్ గెలవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఓడిపోతే.. భవిష్యత్ ప్రణాళికలపై ఎఫెక్ట్
ఈ కీలక పోరులో టీమిండియా ఓటమి తర్వాత జట్టు నైతికత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన జట్టుపై ఎన్నో ఆశలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలానే జరిగితే భవిష్యత్ ప్రణాళికలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న పూర్తి స్థాయి విధానాన్ని పునఃపరిశీలించాలని ఆలోచించవచ్చు.
ఆటగాళ్ల కెరీర్ పై ప్రభావం
ఈ ఓటమి వన్డే జట్టులో చాలా మంది ఆటగాళ్ల భవిష్యత్ కెరీర్ పై ప్రభావితం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ టోర్నమెంట్లలో కీలక పరిస్థితుల్లో బాగా రాణించే ఆటగాళ్ల కోసం సెలక్షన్ కమిటీ వెతికే అవకాశాలు కూడా ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ లో ఆటగాళ్ల ప్రదర్శనలు కూడా వారి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
అభిమానుల్లో మనస్తాపం కలిగిస్తుంది..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై భారత్ ఓడిపోయే పరిస్థితి వస్తే టీమిండియా అభిమానులకు మనస్తాపం కలిగించే విషయం అవుతుంది. భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఓటమి తర్వాత ఆటగాళ్లపై ద్వేషపూరిత దాడి జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారత్ ఒక వేళ పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైతే.. అభిమానుల ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్ లను నిర్వహించడం ద్వారా మీడియా టీఆర్పీని పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఓటమిని భూతద్ధం పెట్టి చూపించినా ఆశ్చర్యం అక్కర్లేదు.
Fans offering prayers & perform Aarti at Varanasi for India's Victory in the Champions Trophy Final. 🇮🇳🙏 [ANI] pic.twitter.com/hl3m7GYjy4
— Johns. (@CricCrazyJohns) March 9, 2025
జట్టు నిర్వహణలో మార్పులు
న్యూజిలాండ్ తో జరిగే ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైతే.. విస్తృత పరిణామాలకు దారితీయవచ్చు. బీసీసీఐ ఆటగాళ్ల ఎంపికపై కఠినమైన ప్రశ్నలు లేవనెత్తవచ్చు. యువకులు, కొత్తవారిని జట్టులోకి తీసుకురావడానికి చాలా అంచనాలు వేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ మ్యాచ్ లో భారత్ ఎలాగైనా గెలవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.