Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ లో ఏ ఏ జట్లు ఆడతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గ్రూప్- ఏ నుంచి ఇప్పటికే టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు చేరుకోగా.. అదే గ్రూప నుంచి ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్ -బీ నుంచి ఒక్క జట్టు కూడా సెమీస్ కు చేరుకోకపోవడం గమనార్హం. గ్రూప్-బీ నుంచి ఇంగ్లాండ్ జట్టు ఎలిమినేట్ కాగా.. సెమీస్ బెర్తుల కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు పోటీ పడుతున్నాయి. ఆసీస్, సౌతాఫ్రికా జట్లకు ఆఫ్ఘనిస్తాను పోటీ ఇస్తోంది. బుధవారం లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
సెమీస్ చేరాలంటే గెలవాల్సిందే..
ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ సెమీ-ఫైనల్ చేరాలంటే నేడు ఆస్ట్రేలియాపై కచ్చితంగా గెలిచి తీరాలి. కానీ ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ కు చేరుతాయి. ఒకసారి గ్రూప్-బీ పాయింట్ల పట్టికను చూస్తే.. సౌతాఫ్రికా 3 పాయింట్లతో మొదటి స్థానంతో, ఆస్ట్రేలియా అదే 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. రెండు పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ మూడో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలిస్తే 5 పాయింట్లతో సెమీస్ కు చేరుతుంది. మరోవైపు ఇంగ్లండ్ పై దక్షిణాఫ్రికా గెలిస్తే ఆ జట్టు కూడా 5 పాయింట్లతో సెమీ-ఫైనల్ కు చేరుతుంది. అయితే నెట్ రన్ రేట్ ఆధారంగా గ్రూప్-బీలో మొదటి, రెండో స్థానాలు నిర్ధారించబడతాయి.

సమీకరణాలు ఇలా..
మరో వైపు ఆసీస్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలిచి.. ఇంగ్లండ్ పై సౌతాఫ్రికా గెలిస్తే.. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా, రెండో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ లు సెమీస్ కు చేరుకుంటాయి. ఈ క్రమంలోనే భారత్ తో సెమీ-ఫైనల్ ఎవరు ఆడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ -ఏ మార్చి 2న భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు గ్రూప్ -ఏలో టాప్ ప్లేస్ లో ఉంటారు. అంటే గెలిచిన జట్టు గ్రూప్ -ఏ టాపర్ గా.. ఓడిన జట్టు రెండో స్థానంలో సెమీస్ కు చేరుకుంటాయి. సెమీఫైనల్ లో గ్రూప్-ఏలోని టాపర్.. గ్రూప్-బీలోని రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. గ్రూప్-బీ టాపర్.. గ్రూప్-ఏలోని రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ ఆడుతుంది.
టీమిండియా మార్చి 2 న న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో గెలిస్తే ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికాతో సెమీస్ ఆడాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ తో కూడా సెమీస్ ఆడొచ్చు. దానికి కొన్ని లెక్కలు కలిసి రావాలి. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే.. ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా గెలిస్తే.. గ్రూప్-బీ టాప్ స్థానంలో సౌతాఫ్రికా.. రెండో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ సెమీ-ఫైనల్ కు వస్తాయి. అప్పుడు భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది.
మరో లెక్క కూడా ఉంది.. ఒక వేళ న్యూజిలాండ్ పై భారత్ ఓడిపోతే.. గ్రూప్ -ఏలో న్యూజిలాండ్ టాపర్ గా, భారత్ రెండో స్థానంలో ఉంటుంది. అప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ తో సెమీస్ ఆడాలంటే.. ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా ఓడిపోతే.. ఇంగ్లండ్ పై సౌతాఫ్రికా పరాజయం పాలైతే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ -బీలో తొలిస్థానంలో ఉంటుంది. భారత్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉంటుంది. అప్పుడు భారత్, ఆఫ్ఘన్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగే అవకాశం ఉంటుంది. ఇలా టీమిండియాతో సెమీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టైనా రావచ్చు.
భారత్ కు పెద్ద సమస్యే..
కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టును తక్కువగా అంచనా వేయలేమని.. గ్రూప్ -బీలో ఆఫ్ఘనిస్తాన్ విజయం భారత జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విమర్శకులు అంచనా వేస్తున్నారు. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడే అన్ని మ్యాచ్ లు దుబాయ్ లోనే జరుగుతాయని తెలిసిందే. అంటే భారత్ జట్టు ఆడే సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్ లోనే జరుగుతుంది. ఆ కోణంలో చూస్తే సెమీఫైనల్ లో ఆఫ్ఘన్ జట్టు టీమిండియాతో ఆడితే.. అది భారత జట్టుపై ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. సాధారణంగా దుబాయ్ స్టేడియంలో పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. భారత జట్టు అన్ని మ్యాచ్ లను దుబాయ్ లో ఆడుతుందని ముందుగానే తెలుసుకుని.. ప్రతిపాదిత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు. మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్పిన్ బౌలింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తోంది. ఆ జట్టులో మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ వంటి ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నారు. వారికి దుబాయ్ స్టేడియంలో అనుభవం కూడా ఉంది. అందువల్ల సెమీ-ఫైనల్స్ లో ఆఫ్ఘన్, భారత్ తలపడితే.. టీమిండియాకు సమస్యగా మారే అవకాశం ఉంది.