ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 కోసం టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించింది బీసీసీఐ. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ ఈ కొత్త జెర్సీలు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. అయితే ఈ జెర్సీపై ఆతిథ్య పాకిస్థాన్ పేరును ముద్రించడం.. ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. జెర్సీపై 'ఛాంపియన్స్ ట్రోఫీ 2025, పాకిస్థాన్' అని ముద్రించారు.
ఐసీసీ జోక్యంతో..
వాస్తవానికి ఐసీసీ టోర్నీల్లో జెర్సీలు, కిట్లపై ఆతిథ్య దేశం పేరును ముద్రించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి బీసీసీఐ.. తమ జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు నిరాకరించింది. పాకిస్థాన్‌లో తాము ఆడటం లేదని, అందుకే పాక్ పేరును తమ జెర్సీ, కిట్ లపై ముద్రించాల్సిన అవసరం లేదని వాదించింది. అయితే, ఐసీసీ జోక్యం చేసుకోవడం వల్ల ఈ వివాదం ముగిసింది. అందుకే తాజాగా బీసీసీఐ.. తమ కొత్త ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలపై పాకిస్థాన్ పేరును ముద్రించి ఆవిష్కరించింది. అలానే ఈ కొత్త జెర్సీతో మన ఆటగాళ్లు ఐసీసీ అవార్డులు అందుకుంటున్న ఫొటోలను తమ అధికార సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ప్రదానం చేసిన అవార్డులివే...
రోహిత్ శర్మ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోగా.. జడేజా టెస్ట్ టీం ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ 'టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అందుకున్నారు. అలాగే, మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కూడా అర్షదీప్ అందుకున్నాడు. కాగా, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా - పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది.