ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో పంత్ ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు చోటు కల్పించకపోవడం క్రికెట్ ప్రియుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. వైట్ బాల్ క్రికెట్ లో సంజూ రీసెంట్ ఫామ్ చూస్తే, అతడిని కచ్చితంగా ఎంపిక చేస్తారనే అంతా అనుకున్నారు. కానీ అతడిని సెలెక్ట్ చేయకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే సంజు రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడం వల్లే, జట్టు నుంచి తప్పించారనే వాదనలు మీడియాలో కనిపిస్తున్నాయి. టీమిండియాకు ఆడాలనుకునే ఆటగాళ్లు.. దేశవాళీ టోర్నీల్లో కచ్చితంగా ఆడాల్సిందేనన్న నిబంధనను తీసుకొచ్చింది బీసీసీఐ. కానీ సంజూ శాంసన్ మాత్రం విజయ్ హాజారే ట్రోఫీలో ఆడలేదు. ఈ కారణంగానే అతడిని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించినట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇదే విషయాన్ని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానికి కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) ప్రెసిడెంట్ జయేశ్ జార్జ్, సంజూ శాంసన్ ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. అతడు క్రమశిక్షణగా వ్యవహరించలేదంటూ ఆరోపణలు చేశారు.
"సంజూ శాంసన్ విజయ్ హజారే ట్రోఫీకి దూరమవడం వల్లే అతడిని జట్టులోకి తీసుకోలేదని నేను కచ్చితంగా చెప్పలేను. జట్టు సన్నాహక క్యాంప్ కు అందుబాటులో ఉండటం లేదని అతడే సందేశం పంపాడు. అది కూడా వన్ లైన్ టెక్స్ట్ పంపాడు. ఎటువంటి కారణాన్ని కూడా వివరించలేదు. నిజానికి అతడు మా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని మేం భావించాం. ఇక అందుకే మేం అతడి పేరు లేకుండానే జట్టును ప్రకటించాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత సెలక్షన్ కు అందుబాటులో ఉంటున్నట్లు మెసేజ్ చేశాడు. సంజూ శాంసన్ లేదా ఇతర ఏ ప్లేయర్ అయినా, కేసీఏకు అంటూ ఓ పాలసీ ఉంటుంది. గౌరవంగా వ్యవహరించాలి. జట్టులోకి రావడానికి సంజూకు క్యాంప్ అవసరం లేదు. అతడు తనకు నచ్చినప్పుడు మాత్రం వచ్చి కేరళ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడా?. సంజూ జాతీయ జట్టులోకి ఎలా వెళ్లాడు.. అది కేసీఏ ద్వారా మాత్రమే." అని పేర్కొన్నారు.
కాగా, సంజూ శాంసన్ ఆడిన గత 10 వన్డేల్లో 65.33 సగటుతో 392 పరుగులు సాధించాడు. అందులో 3 సార్లు 50+ స్కోర్లు చేయగా స్ట్రైక్ రేటు 100కి పైగా ఉంది. ఇదే సమయంలో రిషబ్ పంత్ గత 10 వన్డేల్లో 36.22 యావరేజ్ తో 326 పరుగులు చేశాడు. పంత్ కూడా 3 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. కానీ వన్డేల్లో అతడి స్ట్రైక్ రేట్ 97.31 మాత్రంగానే ఉంది. అయితే పంత్ కు ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, సంజూ శాంసన్ ను మాత్రం పక్కన పెట్టారు.
శశి థరూర్ సపోర్ట్
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి శాంసన్ కు అండగా నిలిచారు. అతడిని విమర్శించిన కేసీఏపై విమర్శలు గుప్పించారు. కేరళ క్రికెట్ బోర్డులో ఇగోలు ఎక్కువైపోయాయని అన్నారు. వారి ఇగోలు వల్ల శాంసన్ కెరీర్ నాశనమవుతోందని ఆరోపించారు.