కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ లీకైంది. ఇందులో భారత క్రికెటర్ల కుటుంబ సభ్యుల ప్రయాణాలపై బీసీసీఐ విధించిన ఆంక్షల గురించి ఉంది. ప్రస్తుతం వీరిద్దరి పర్సనల్ కన్వర్జేషన్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో వారిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారంటే?
తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశం ప్రారంభానికి ముందే రోహిత్-అగార్కర్ బీసీసీఐ విధించిన కొత్త నియమాల గురించి చర్చించుకున్నారు. కానీ ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉండడం వల్ల వారి సంభాషణకు సంబంధించి ఆడియో రికార్డు అయింది.

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. "అబ్ మేరే కో సెక్రటరీ కే సాత్ ఏక్ ధేడ్ ఘంటా బైట్నా పడేగా. ఫ్యామిలీ - వామిలీ కా డిస్కక్ కర్నే కే లియే, యే సబ్ మేర్ కో బోల్ రహే హై (ఫ్యామిలీల గురించి మాట్లాడేందుకు నేను మరో గంటన్నార పాటు సెక్రటరీతో కూర్చోవాలి. క్రికెటర్లందరూ నన్నేఅడుగుతున్నారు.)" అని అన్నాడు.
కాగా, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు విఫలమైన నేపథ్యంలో భారత క్రికెట్లో ప్రక్షాళన కోసం బీసీసీఐ 10 అంశాలతో నియమావళి రూపొందించిందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆ నియమావళికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. అందులోనే క్రికెటర్ల కుటంబ సభ్యుల ప్రయాణాల గురించి కూడా ఉంది. సుదీర్ఘ కాలం సాగే పర్యటనలో ప్లేయర్స్ తో వారి కుటుంబ సభ్యులు కేవలం 14 రోజులు మాత్రమే ఉండాలని ఈ నిబంధనల్లో బీసీసీఐ పేర్కొందట. ఏదేమైనా ఇప్పుడీ విషయం గురించి రోహిత్ అధికారికంగా చెప్పకపోయినా అక్కడి మైక్రోఫోన్‌లో రికార్డైంది.