ఏదైనా సిరీస్ లేదా పెద్ద టోర్నీ అయినా.. జట్టులో స్థానం కోసం వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్ - రిషభ్ పంత్ మధ్య ఎప్పుడూ పోటీ నెలకొంటూనే ఉంటుంది. సెలక్టర్లు వీరిద్దరిలో వికెట్ కీపర్ గా ఎవరికో ఒకరికే చోటు ఇస్తూ మరొకరిని బెంచ్ కు పరిమితం చేస్తుంటారు. ప్రస్తుతం జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ కు చోటు దక్కగా.. పంత్ బెంచ్ లోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ - హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య మనస్ఫర్థలు కూడా వచ్చినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం రిషభ్ పంత్ తో పోటీ, తనపై నెలకొనే ఒత్తిడి గురించి మాట్లాడాడు కేఎల్ రాహుల్. "జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. ఈ విషయం నేను అబద్ధం చెప్పను. నేను అతడితో పోటీ పడటానికి ప్రయత్నించను. అలానే అతడిలా ఆడేందుకు ట్రై చేయను. నాకు తెలిసి పంత్ కూడా అతడికి అవకాశం వచ్చినప్పుడు ఇలానే ఆలోచిస్తాడు. ఎవరితో పోటీ పడడు. అతడు గెప్ప టాలెంట్ ప్లేయర్. అతడు దూకుడుగా ఎలా ఆడతడో, పరిస్థితిని బట్టి ఆటను ఎప్పటి కప్పుడు ఎలా మార్చుకోగలడో మనందరికి తెలుసు. కాబట్టి ఎప్పుడు కెప్టెన్, కోచ్ కు నన్ను ఆడించాలా లేదా అతడిని తీసుకోవాలా అని ఎప్పుడూ చర్చ ఉంటుంది. కాబట్టి నాకు అవకాశం నేను నా వంతుగా బెస్ట్ గా ఆడేందుకు ప్రయత్నిస్తాను." అని చెప్పగలను అని పేర్కొన్నాడు.

అదే క్రీడకు అందం..
తన ప్రదర్శనపై అప్పుడప్పుడు వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. "నేను ట్రోలింగ్ కు గురౌతుంటాన్న సంగతి తెలుసు. దాన్ని నేను స్వీకరిస్తాను. కానీ నేనెప్పుడు జట్టుకు ఏది అవసరమో, దాన్ని ఇచ్చేందుకు నా వంతుగా ఉత్తమంగా ప్రయత్నిస్తాను. నేను కూడా తప్పులు చేస్తుంటాను. కానీ అదే ఓ క్రీడకు అందం." అని చెప్పుకొచ్చాడు.