దాదాపు 29 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యమిస్తోంది పాకిస్థాన్. దీంతో ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా.. భారీ ఎత్తున సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులను మోహరించింది. అంత కష్టపడి భారీ మొత్తంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు తొలి మ్యాచ్ లోనే పాకిస్థాన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ - పాకిస్థాన్ మధ్య జరుగుతోన్న ఓపెనింగ్ మ్యాచ్ ప్రేక్షకులు కరువయ్యారు.
కరాచీ వేదికగా ఈ ఓపెనింగ్ మ్యాచ్ నిర్వహించారు. అయితే ఈ పోరుకు చాలా తక్కువ సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ హాజరయ్యారు. స్టేడియంలో చాలా వరకు ఖాళీ స్టాండ్‌లు దర్శనమిచ్చాయి. ఈ కరాచీ స్టేడియం సామర్థ్యం 30 వేలమంది కాగా, కనీసం సగం మంది కూడా రాలేదని అర్థమవుతోంది. 15 వేల మంది కన్నా తక్కువగా ఆడియెన్స్ ఈ మ్యాచ్ కు హాజరైనట్లు సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. భారీ మ్యాచ్, పైగా హోం స్టేడియంలో జరుగున్న పోరు.. అయినా అభిమానులు రాకపోవడంతో మైదానం బోసిపోయింది.

ప్రస్తుతం ప్రేక్షకులు పెద్దగా హాజరుకానీ ఈ కరాచీ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలను మరింత షేర్ చేస్తూ పీసీబీపై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'కరాచీ స్టేడియం ఖాళీగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. 29 ఏళ్ల తర్వాత హోం స్టేడియంలో ఐసీసీ ఈవెంట్ ను నిర్వహిస్తుంటే ఎవరూ రాలేదు.', 'చూద్దాం లహోర్, రావల్పిండి పరిస్థితేంటో. కరాచీ స్టేడియం ఎక్స్ పీరియన్స్ బాలేదు. సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేనప్పుడు ఎందుకు డబ్బులు వృథా చేస్తున్నారో' అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.