ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దూరంగా ఉన్న పేసర్ బుమ్రా ఈ మెగా టోర్నీలోని కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు సమాచారం అందింది.
భారత స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. బోర్డర్ గావస్కర్ సిరీస్, సిడ్నీ టెస్టులో అతడు వెన్ను నొప్పితో బాధపడ్డాడు. అయినప్పటికీ ఈ సిరీస్‌లో 32 వికెట్లు తీసిన ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అయితే వర్క్‌లోడ్ పెరగడం వల్ల ఒత్తిడికి గురైన బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ మెడికల్ బృందం భావించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి, అతడు అందుబాటులో ఉండే రీతిలో తీర్చిదిద్దాలని బీసీసీఐ అతడికి రెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

దీంతో సొంతగడ్డపై జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు అతడు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్ లకు మాత్రమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలోని గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలిసింది. గాయం తీవ్రత ఎక్కువైతే ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు మిస్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందింది. టీమ్ ఇండియా నాకౌట్ స్టేజ్ కు చేరుకుంటే మాత్రం అతడు అందుబాటులోకి వస్తాడట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భారత జట్టు కు పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే గ్రూప్ స్టేజ్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంటుంది.
మళ్లీ అదే పరిస్థితి
బుమ్రా గాయంతో మ్యాచ్ లకు దూరం కావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పెద్ద టోర్నమెంట్ లకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్ వంటి పెద్ద పోరులకు అతడు అందుబాటులో లేడు. దీంతో భవిష్యత్ మేజర్ టోర్నమెంట్ ల కోసం, ఇప్పుడు బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవడం బీసీసీఐకి పెద్ద సవాల్ గా మారింది.
మరోవైపు బుమ్రా త్వరగా పూర్తి ఫిట్ నెస్ సాధించి కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నారు. కాగా, ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్లను బీసీసీఐ జనవరి 9 లేదా 10వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.