ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా తాజాగా జరిగిన చావోరేవో మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై అప్ఘానిస్థాన్ గెలిచింది. హోరాహోరీగా సాగిన ఈ ఉత్కంఠ పోరులో 8 పరుగులు తేడాతో గెలిచింది. తద్వారా గ్రూప్ బీలో సెమీఫైనల్ ఆశల్ని సజీవం చేసుకుంది. ఇక ఇంగ్లాండ్ వరుసగా రెండో ఓటమితో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ అద్భుత సెంచరీతో మెరిసినా వృథా అయిపోయింది. అతడు 90 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 111 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 120 పరుగులు చేశాడు. బెన్ డకెట్ (38), జోస్ బట్లర్ (38), హ్యారీ బ్రూక్ (25), జేమీ ఓవర్టన్ (27) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లతో చెలరేగాడు. మహమ్మద్ నబీ 2, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నైబ్, ఫజల్ హక్ ఫారూఖి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 177 పరుగులు) దుమ్మురేపాడు. అతడితో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ (31 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌ల సాయంతో 41 పరుగులు), మహమ్మద్ నబీ (24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 40 పరుగులు), హష్మాతుల్లా షాహిది (67 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 40 పరుగులు) చేశారు. జోఫ్రా ఆర్చర్ (3/64) దెబ్బకు అఫ్ఘాన్ 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లినా.. జద్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో భారీ స్కోర్ చేసింది. లివింగ్ స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.
Afghanistan take an absolute nail-biter to stay alive in the #ChampionsTrophy 2025 🤯📈#AFGvENG ✍️: https://t.co/6IQekpiozs pic.twitter.com/b3PUb6jfZo
— ICC (@ICC) February 26, 2025