ధోనిపై ఒత్తిడి: మాంచెస్టర్‌లో పేలుళ్లపై ఇంగ్లాండ్‌లో కోహ్లీ (ఫోటోలు)
హైదరాబాద్: మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్‌ల రాకతో ధోనిపై మ్యాచ్ ఫినిష్ చేసే ఒత్తిడి చాలా వరకు తగ్గిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. 2013లో ధోని నేతృత్వంలోని విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.
ఛాంపియన్ ట్రోఫీ ఆడేందుకు ఇప్పటికే టీమిండియా ఇంగ్లాండ్‌కు చేరుకుంది. ఈనేపథ్యంలో ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన కోహ్లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. విదేశీ గడ్డపై కెప్టెన్‌గా కోహ్లీ ఆడుతున్న తొలి ఐసీసీ టోర్నీ కావడంతో కాస్తంత ఉద్వేగాన్నిస్తోందని చెప్పుకొచ్చాడు.
గత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన భారత జట్టుతో పోలిస్తే ఇప్పుడు అన్ని విషయాల్లోనూ మరింత మెరుగుపడ్డామని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు. 'గతసారి మా పేసర్లు, స్పిన్నర్లు, ఓపెనర్లు అద్భుతంగా రాణించడంతో కప్ గెలుచుకున్నాం. అయితే నాలుగేళ్ల క్రితం నాటి యువ జట్టుతో పోలిస్తే ఇప్పుడు మా ఆటగాళ్లలో మరింతగా అనుభవం పెరిగింది' అని కోహ్లీ అన్నాడు.
'అన్ని విభాగాల్లోనూ పరిణతి సాధించడంతో పాటు మరింత ఫిట్‌గా మారారు. ఇంగ్లండ్‌లో బ్యాట్స్‌మెన్‌కు కఠిన సవాళ్లు ఎదురవుతాయి. దీనిని ఎదుర్కోవడానికి మేం సిద్ధం. మా జట్టులో మంచి పేసర్లతోపాటు సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్ ఉన్నారు. జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ వారి వల్లే గెలవగలిగాం' అని కోహ్లీ వివరించాడు.

లోయర్ మిడిలార్డర్‌ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది
'ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో లోయర్ మిడిలార్డర్‌ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్‌లో ధోనిపై అధిక భారం ఉండేది. ఎందుకంటే సరైన ఆటగాళ్లు అందుబాటులో లేక మ్యాచ్‌ను ముగించే ఒత్తిడి మొత్తం అతనిపైనే పడేది. ఇప్పుడు జాదవ్, హార్దిక్ ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో బాగా ఆడుతున్నారు' అని అన్నాడు.

జట్టు మంచి సమతుల్యంతో కనిపిస్తోంది
'జట్టు కూడా మంచి సమతుల్యంతో కనిపిస్తోంది. ప్రణాళికలను ఎంత మేరకు అమలు చేస్తారన్నది ఈ టోర్నీలో తేలుతుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల్లో ఆడటం పెద్ద సవాల్ అని, దీనిని అధిగమించి డిపెండింగ్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తాం' అని కోహ్లీ చెప్పాడు.

ఫిట్‌నెస్‌తో చాలా ముఖ్యం
స్వదేశంలో సుదీర్ఘ టెస్టు సిరీస్, ఐపీఎల్ తర్వాత వన్డే ఫార్మాట్ ఆడుతున్నాం కాబట్టి ఫిట్‌నెస్‌తో ఉండటం చాలా ముఖ్యమని కోహ్లీ అంగీకరించాడు. 'శరీరాన్ని కాపాడుకోవడం అతిపెద్ద పెద్ద సవాల్. మానసికంగా ఉత్సాహంగా ఉండటం వ్యక్తులను బట్టి ఉంటుంది. ఫార్మాట్‌ను బట్టి ఆట ఆడాలనే దానికి నేను విరుద్ధం. మూడు ఫార్మాట్లలో నాణ్యమైన ఆటతీరును చూపించాల్సిందే' అని కోహ్లీ అన్నాడు.

మాంచెస్టర్‌లో పేలుళ్లపై కోహ్లీ
'జట్టు మొత్తం ఇదే విధంగా ఆడుతుందని నమ్ముతున్నా. మానసికంగా కొద్దిగా వెసులుబాటు చేసుకోవడం తప్పనిసరి. భిన్న ఫార్మాట్లకు శరీరం భిన్నంగా స్పందిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆడాలి' అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇక మాంచెస్టర్‌లో పేలుళ్లు జరిగినప్పటికీ క్రికెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేదని కోహ్లీ అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
ఛాంపియన్స్ ట్రోఫీకి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కోహ్లీ అన్నాడు. 'కొన్ని రోజుల కిందట ఇక్కడ జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరమైనవి. ఇవి ప్రతి ఒక్కర్ని చాలా కలిచివేశాయి. ఇంగ్లాండ్ లాంటి ప్రాంతాల్లో గతంలో ఇలాంటి సంఘటనలు పెద్దగా జరుగలేదు. కాబట్టి ఈ ఉదంతాన్ని చూసి కొంతమంది భయపడి ఉండొచ్చు. కానీ మా జట్టు మొత్తం క్రికెట్‌పై దృష్టి కేంద్రీకరించింది' కోహ్లీ పేర్కొన్నాడు.

భద్రతపై కోహ్లీ సంతృప్తి
ఇక, ఛాంపియన్స్ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన భద్రతపై కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని, వాటిని దృష్టిలో పెట్టుకుని మేం ఇక్కడ మసులుకోవాలని కోహ్లీ అన్నాడు. ఏ ప్రాంతాలకు ఏఏ సమయాల్లో వెళ్లొచ్చో స్పష్టంగా చెబుతున్నారు. వెళ్లకూడని ప్రదేశాల గురించి ముందే వివరిస్తున్నారు అని కోహ్లీ వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications