
దుబాయ్: దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రం ఇప్పటివరకు అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. అధికారిక షెడ్యూల్ విడుదలపై బీసీసీఐ, ఐపీఎల్ మేనేజ్మెంట్ రోజుకో ప్రకటన చేస్తున్నాయి. షెడ్యూల్‌ను శుక్రవారం (ఆగష్టు 4)విడుదల చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించినప్పటికీ.. బోర్డు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
సమయం గడుస్తున్నా షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభమయ్యాయి. ఇంతకు లీగ్ జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఆదివారం విడుదల కానుందని లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచే ప్రారంభం కానుందని సమాచారం. ఐపీఎల్ 2020 టోర్నీ దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది.
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఐపీఎల్ లీగ్ యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. బయో సెక్యూర్ వాతావరణంలో ఈ నెల 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 13వ సీజన్ జరుగనుంది. ఐపీఎల్ 13వ సీజన్ కోసం అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి.
గతేడాది ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఆరంభ మ్యాచ్ ఆడాలి. కరోనా కేసులు రావడంతో చెన్నై టీమ్ శుక్రవారమే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై ఆటగాళ్లు సాధన చేయడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై స్థానంలో మరో టీమ్‌కు అవకాశం ఇవ్వనున్నారు. మరోవైపు చెన్నై తొలి మ్యాచ్ ఆడుతుందని అంటున్నారు. ఏదేమైనా రేపు అసలు విషయం తేలనుంది.