హైదరాబాద్: ఆదివారం కివీస్‌తో ముగిసిన తొలి వన్డేలో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ఎదుర్కొన్న సవాళ్లు తదుపరి మ్యాచ్‌లకు వారిని మానసికంగా దృఢంగా చేస్తాయని భారత బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్లు లాథమ్, రాస్ టేలర్లు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ జోడీని భారత స్పిన్ ద్వయం పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు.

'ఇలాంటి మ్యాచ్‌లు బౌలర్లను మానసికంగా దృఢంగా చేస్తాయి. పిచ్ సరిగా సహకరించకపోయినా ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి' అని దినేశ్ కార్తీక్ అన్నాడు. అంతేకాదు పరిమితి ఓవర్ల మ్యాచ్‌ల్లో భారత్ విజయాలు సాధించడంలో కీలకపాత్ర వహించే కుల్దీప్, చాహల్ సొంత ఆలోచనలు జట్టు యాజమాన్యానికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని తెలిపాడు.
ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో వాళ్లు రాణించకపోవడం జట్టు సుదీర్ఘ ప్రయాణానికి పెద్ద ఇబ్బంది కలిగించదని కూడా అన్నాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఈ ఇద్దరు స్పిన్ బౌలర్లకు అండగా ఉంటుందని చెప్పాడు. గత సిరీస్‌లో వాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని వారి ఆత్మ విశ్వాసానికి ఆకాశమే హద్దని దినేశ్ కార్తీక్ కొనియాడాడు.
ఒకటి, రెండు పేలవ ప్రదర్శనలు ఒక బౌలర్‌ని పనికిరాని వాడిగా చేయలేవని అన్నారు. ఈ సందర్భంగా తొలి వన్డేలో కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, లాథమ్‌ని దినేశ్ ప్రశసించాడు. వారిద్దరూ కొన్ని షాట్లు అద్భుతంగా ఆడారని చెప్పుకొచ్చాడు.
తన ఇన్నింగ్స్‌పై వ్యాఖ్యానిస్తూ తాను శుభారంభం చేసినా దానిని సుదీర్ఘ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయానని చెప్పాడు. తాను ఇంకొంచెం సేపు బ్యాటింగ్ చేసి ఉంటే చివర్లో తమ జట్టుకు మరో 15-20 పరుగులు ఎక్కువగా వచ్చి ఉండేవని తెలిపాడు.
'పిచ్(వికెట్)ను గమనించండి. చాలా గట్టిగా ఉంది. చాలా బంతులు గాల్లో తేలిపోయాయి. బ్యాట్‌కు అందకుండా పోయాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో పిచ్ భిన్నంగా ఉంది. నిజం చెప్పాలంటే పరుగులు చేయడం కష్టమైంది. బంతి కుడి, ఎడమలవైపు మిడాఫ్, కవర్స్ వైపు వెళ్లింది. బంతి టైమింగ్‌ను అంచనా వేయడం కష్టమైంది' అని దినేశ్ కార్తీక్ వాపోయాడు.