హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా బీసీసీఐ పాటిస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్ బేరర్లు తప్ప మరెవర్నీ ఏజీఎంకు అనుమతించొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బీసీసీఐ పాటించింది.
దీంతో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీని బుధవారం జరిగిన సమావేశానికి అనుమతించలేదు. మరోవైపు ఆఫీస్ బేరర్లు కాకపోవడంతో జోహ్రీతో పాటు ఒడిశా, పంజాబ్ ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త, సహాయ కార్యదర్శులు, కోశాధికారి మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనడానికి అర్హులు. దీంతో సుప్రీం ఆదేశాలను బీసీసీఐ పాటించింది.

ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలను కచ్చితంగా పాటించాలనే ఉద్దేశంతో బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరియే స్వయంగా జోహ్రీ, ఇతర సిబ్బందిని సమావేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు.
ఇక రాష్ట్ర సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధుల అనుమతి పత్రాలను స్వయంగా ఆయనే తనిఖీ చేయడం విశేషం. కాగా, అవసరమైన పత్రాలు, కార్యాలయ పనుల కోసం ఆఫీస్ బేరర్లు ఉద్యోగుల సాయం కోరడం ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తోంది.