కోల్‌కతా: భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్‌శర్మపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ వరకు రోహిత్ శర్మ ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మన్‌కూ తీసిపోడని సౌరవ్ గంగూలీ అన్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అజేయ సెంచరీ(171)తో కదంతొక్కిన రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో దిగ్గజ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం తీసిపోడని అన్నాడు. కానీ సుధీర్ఘ ఫార్మాటైన టెస్టులకొచ్చేసరికి రోహిత్ ఆస్థాయి ప్రదర్శనను పునరావృతం చేయడంలో విఫలమవడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నాడు.

పెర్త్ వన్డేలో రోహిత్ అద్భుత ఇన్నింగ్స్‌ను ఆసాంతం ఆస్వాదించానన్న గంగూలీ, వన్డే క్రికెట్లో టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ ప్రతిభ నిజంగా అద్భుతమని కొనియాడాడు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తనదైన సూపర్ షాట్లతో సులువుగా పరుగులు రాబట్టే అతని ఆట తీరు మిగతా క్రికెటర్ల కంటే మిన్నగా ఉంటుందన్నాడు. ఆసీస్‌తో వన్డేలో వెలకట్టలేని ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రోహిత్ అద్భుత క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు.

లిబ్రా లెజెండ్స్ కెప్టెన్‌గా గంగూలీ
మాజీ క్రికెటర్లు తలపడే మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్(ఎమ్‌సీఎల్)లో లిబ్రా లెజెండ్స్ జట్టుకు కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవమున్న గంగూలీ.. జట్టుకు కెప్టెన్సీతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం జరిగిన లిబ్రా జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నాడు.