చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్: 1987 తరువాత తొలిసారిగా!

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో సంచలన విజయాన్ని అందుకుంది పాకిస్తాన్ క్రికెట్ టీమ్. అనిశ్చితి ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే సర్ఫరాజ్ అహ్మద్ సేన.. స్ఫూర్తిదాయక గెలుపును సాధించింది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ టీమ్‌ను 237 పరుగులకే కట్టడి చేసిన పాకిస్తాన్.. లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది. దీనికోసం నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయింది. లక్ష్యాన్ని అందుకునే క్రమంలో పాకిస్తాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ ఓ చరిత్రనే సృష్టించాడు.

32 సంవత్సరాల తరువాత తొలిసారిగా..మిడిలార్డర్‌లో
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తరఫున మిడిలార్డర్‌లో వచ్చి సెంచరీ సాధించాడు. 127 బంతుల్లో 11 ఫోర్లతో 101 పరుగులను చేశాడు ఆజమ్. మిడిలార్డర్‌లో క్రీజులోకి వచ్చి ప్రపంచకప్‌లో ఓ పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ సెంచరీని నమోదు చేయడం 32 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 1987 నాటి ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్లు టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు జావెద్ మియాందాద్, సలీమ్ మాలిక్ సెంచరీలు సాధించారు. సింధ్ ప్రావిన్స్‌లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో జావెద్ మియాందాద్ 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫైసలాబాద్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో సలీమ్ మాలిక్ శ్రీలంకపైనే 100 పరుగులు చేశాడు. ఇక అంతే! అప్పటి నుంచి నిన్నటి న్యూజీలాండ్‌తో మ్యాచ్ దాకా మిడిలార్డర్‌లో ఏ ఒక్క పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ కూడా ప్రపంచకప్ టోర్నమెంట్లలో మూడంకెల స్కోరును అందుకోలేకపోయారు. తాజాగా ఆ రికార్డును అందుకున్నాడు బాబర్ ఆజమ్.

ఇప్పటిదాకా అయిదు మంది..
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా పాకిస్తాన్‌కు చెందిన కేవలం అయిదు మంది బ్యాట్స్‌మెన్లే మిడిలార్డర్‌లో సెంచరీలు సాధించారు. 1983 ప్రపంచకప్‌లో ఇమ్రాన్ ఖాన్ శ్రీలంకపై 102 పరుగులు, అదే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ జహీర్ అబ్బాస్ న్యూజీలాండ్‌పై 103 పరుగులు చేశారు. వారిద్దరూ నాటౌట్‌గా నిలిచారు. 1987 ప్రపంచకప్‌లో శ్రీలంకపై జావెద్ మియాందాద్, సలీమ్ మాలిక్ ఈ ఘనతను సాధించారు. వారి తరువాత బాబర్ ఆజమ్ ఈ రికార్డును అందుకున్నాడు.

నాన్ ఓపెనర్‌గా వెళ్లి..
సెంచరీతో మరో ఘనతను కూడా సాధించాడు బాబర్ ఆజమ్. ప్రత్యర్థి జట్టు విధించిన లక్ష్యాన్ని అందుకునే క్రమంలో నాన్ ఓపెనర్‌గా వెళ్లి అత్యధిక స్కోరును నమోదు చేసిన రికార్డు కూడా ఆజమ్‌దే. ఛేజింగ్ ఇన్నింగ్‌లో నాన్ ఓపెనర్‌గా వెళ్లి ఇప్పటిదాకా పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్లు ఎవరూ సెంచరీలు చేయలేదు. ఈ లోటును బాబర్ ఆజమ్ భర్తీ చేశాడు. 1979 ప్రపంచకప్‌లో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై జహీర్ అబ్బాస్ 93 పరుగులు చేశారు. అదే ఇప్పటిదాకా నాన్ ఓపెనర్ ఛేజింగ్‌లో హయ్యెస్ట్ స్కోర్. ఆ తరువాత 1987లో కరాచీలో జరిగిన మ్యాచ్‌లో సలీమ్ మాలిక్ ఇంగ్లండ్‌పై 88 పరుగులు, 2011లో శ్రీలంకలోని పల్లెకెలెలో అసద్ షఫిక్ 78 పరుగులు చేశారు. వాటన్నింటినీ తిరగరాశాడు బాబర్ ఆజమ్.
{headtohead_cricket_4_5}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications