వెస్టిండీస్ : టీమ్ ఇండియాతో జరిగే టీ-20 సిరీస్ కోసం.. విండీస్ కెప్టెన్ డారెన్ సామీని పక్కనబెట్టేసింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. ఇండియాతో టీ-20లకు సిక్సర్ల వీరుడు బ్రాత్ వైట్ ను కెప్టెన్ గా ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
వ్యూహాత్మక మార్పుల్లో భాగంగానే.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విండీస్ కెప్టెన్సీని మార్చేసినట్లుగా తెలుస్తోంది. అయితే విండీస్ జట్టుకు రెండు ప్రపంచ కప్ లు అందించిన డారెన్ సామీ సేవలకు కృతజ్ఞతలు తెలిపింది విండీస్ బోర్డు.

ఇదిలా ఉంటే భారత్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో బ్రాత్ వైట్ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. టీ20 ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్.. చివరి నాలుగు బంతులకు నాలుగు వరుస సిక్సర్లు బాది విండీస్ ను విజయ తీరాలకు చేర్చాడు బ్రాత్ వైట్. ఇకపోతే టీమ్ ఇండియాతో విండీస్ టీ20 మ్యాచ్ లు ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి. సునీల్ నరైన్, పొలార్డ్ కూడా విండీస్ జట్టుతో జతకూడనున్నారు. మొత్తానికి టీ20 ఫార్మాట్ లో ఆరితేరిన విండీస్ ను ఎదుర్కోవడం టీమ్ ఇండియా చెమటోడ్చక తప్పదు.