Rohit Sharma: తుది జట్టు ఎంపిక మాకు సవాలే.. కుర్రాళ్లకు ఆందోళన అవసరం లేదు

వరుసగా మూడో సీరిస్‌లోనూ ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో కుర్రాళ్లు బాగా ఆడారని రోహిత్ ప్రశంసించాడు. అలాగే రానున్న రోజుల్లో జట్టులో స్థానం విషయమై ఆటగాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చాడు. అంతేకాకుండా కుర్రాళ్లు సత్తా చాటుతుండడంతో రానున్న రోజుల్లో తుది జట్టు ఎంపిక తనకు, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కష్టంగా మారుతుందని రోహిత్ శర్మ అంగీకరించాడు.

ఆందోళన అవసరం లేదు
శ్రీలంకతో టీ20 సిరీస్‌లో తాము చాలా బాగా ఆడామని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ సిరీస్‌లో తమకు చాలా సానుకూలంశాలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. తమ రిజర్వ్ బెంచ్ బలం ఎంటో తెలుసుకోవాలనుకున్నామని, ఈ క్రమంలోనే కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చామని తెలిపాడు. జట్టులో స్థానం విషయమై యువ ఆటగాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చెప్పాడు.

ఆ స్థానాలు భర్తీ చేస్తాం
తాము ప్రస్తుతం ఏయే విభాగాల్లో రాణించడం లేదో గుర్తించి ఆ విభాగాలను భర్తీ చేయాలనుకుంటున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే భవిష్యత్‌లో ముందు సాగనున్నట్లు చెప్పాడు. ఇది సవాల్‌తో కూడుకున్న విషయమే అయినప్పటికీ, ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశమని తెలిపాడు. ఇక టెస్ట్ సిరీస్ గురించి తాము మొహాలీకి వెళ్లాకే ఆలోచిస్తామని రోహిత్ శర్మ చెప్పాడు.

అది సవాల్‌తో కూడిన పని
ప్రస్తుతం తుది జట్టు ఎంపిక హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు, తనకు సవాల్‌తో కూడిన పని అని రోహిత్ శర్మ అన్నాడు. ఈ సిరీస్‌లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడారని కొనియాడాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారని రోహిత్ చెప్పాడు.

చెలరేగిన శ్రేయస్ అయ్యర్
శ్రీలంకతో సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లేకపోవడంతో తుది జట్టులో స్థానం సంపాదించుకున్న అయ్యర్ మొదటి టీ20లో కేవలం 28 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండో టీ20 మ్యాచ్‌లో 184 పరుగుల ఛేజింగ్‌లో కేవలం 44 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఆదివారం జరిగిన ఫైనల్ టీ20 మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లో 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 204 పరుగులు చేసిన అయ్యర్ ఒక సారి కూడా ఔటవ్వలేదు.

టెస్టులకు రెడీ
టీ20 సిరీస్‌లో లంకేయులను చిత్తు చేసిన టీమిండియా ఇక టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మార్చి 12 నుంచి బెంగళూరు వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ టెస్టుగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications