చెన్నై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్‌ను కలిశాడు. దక్షిణాఫ్రికాతో గురువారం చెన్నైలో నాలుగో వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని బోట్స్ క్లబ్‌లోని శ్రీనివాసన్ ఇంటికి వెళ్లాడు.
ధోనిని శ్రీనివాసన్ ఆత్మీయంగా పలకరించి ఇంట్లోకి ఆహ్వానించాడు. శ్రీనివాసన్ ఇంట్లో ధోని అల్పాహారం తీసుకున్నాడు. తెలుగు, తమిళ నేల సుప్రసిద్ధ అల్పాహారం మసాలా దోసెను ధోనీ ఆరగించాడట. ఆ తర్వాత ధోనీ కూతురు, కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను శ్రీని అడిగి తెలుసుకున్నారు.

దాదాపు 45 నిమిషాలకుపైగా వీరిద్దరూ సమాలోచనలు చేశారు. అనంతరం ధోని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఈ భేటీ వ్యక్తిగతమంటూ మీడియాకు ముఖం చాటేసి వెళ్లిపోయాడు. ఈ భేటీపై క్రికెట్ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేశారు.
పలు వివాదాల్లో చిక్కుకుని వివాదాస్పదుడిగా ముద్రపడ్డ శ్రీనివాసన్ ఇంటికి టీమిండియా కెప్టెన్ హోదాలో ఉన్న ధోనీ వెళ్లడం సరికాదంటూ వారు ఆక్షేపించారు. ఈ తరహా భేటీలు తప్పుడు సంకేతాలిస్తాయని చెప్పిన బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్మ వర్మ టీమిండియా కెప్టెన్ ధోనికి ఏకంగా లేఖ కూడా రాశారు.
ఇలాంటి పనులు పునరావృతం కాకుండా చూడాలంటూ ఆయన ధోనీకి సూచనలు చేశారు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్ భవితవ్యం గురించి వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.