ముంబై: చెన్నై సూపర్ కింగ్స్, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ట్వంటీ20 క్రికెట్‌లో మరో సరికొత్త రికార్డుని నమోదు చేశాడు. ట్వంటీ20 వరల్డ్ క్రికెట్లో 200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్వవహారించిన తొలి ఆటగాడు ధోనియే.
అన్ని అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్‌లతో(అంతర్జాతీయ, ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్) ధోని ఈ రికార్డుని సాధించాడు. 33 ఏళ్ల ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ ఎడిషన్‌లో క్వాలిఫయిర్ 1లో భాగంగా మంగళవారం రాత్రి ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని సృష్టించాడు.

2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ20లో ధోని తన తొలి ట్వంటీ20 మ్యాచ్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఐసీసీ వరల్డ్ ట్వంటీ20లో స్కాట్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ధోని కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. అంతేకాదు ట్వంటీ20 ఛాంపియన్స్‌గా టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు.
ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ రెండు సార్లు ఐపీఎల్ (2010, 2011) టైటిల్స్‌ని సాధించింది. దీంతో పాటు సీఎల్టీ20 (2010, 2014)ను కైవసం చేసుకుంది. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏర్పడినప్పటి నుంచి కెప్టెన్‌గా ధోనియే కొనసాగుతున్నాడు.
ట్వంటీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్వవహరించినవారు:
* MS Dhoni - 200* (Won 118, Lost 77)
* Gambhir - 119 (Won 70, Lost 47)
* George Bailey - 93 (Won 47, Lost 44)
* Darren Sammy - 92 (Won 46, Lost 42)
* Adam Gilchrist - 83 (Won 40, Lost 43)