
Image Credit: © ESPNcricinfo Ltd
హైదరాబాద్: కెప్టెన్సీ అంటే ఎంతో అనుభవం సంపాదించుకున్న తర్వాత వస్తుంది. అయితే కొందరు మాత్రం అనూహ్యంగా కెప్టెన్లు అయిపోతూ ఉంటారు. ఒకటీ రెండు మ్యాచ్‌ల అనుభవంతో జాతీయ జట్టుకు కెప్టెన్ అయి, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు అది కొద్దిమంది మాత్రమే ఉన్నారు.
తాజాగా భారత్‌తో జరుగుతున్న ఆరు వన్డేల సిరిస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన మర్క్రమ్ తన కెరీర్‌లో ఆడిన మూడో వన్డేతోనే ఆ బాధ్యతలు తీసుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. సఫారీ జట్టులో ఎంతో మంది సీనియర్ క్రికెటర్లు ఉన్నప్పటికీ బోర్డు మాత్రం మర్క్రమ్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం విశేషం.
డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో గాయం కారణంగా డుప్లెసిస్ దూరం కావడంతో అతడి స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 23 ఏళ్ల మర్క్రమ్‌కు అవకాశం ఇచ్చింది. అయితే, తన కెరీర్‌లో ఇంత త్వరగా కెప్టెన్సీ అవకాశం వస్తుందని మర్క్రమ్ ఊహించి ఉండకపోవచ్చు.
దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న పిన్న వయస్కుల్లో మర్క్రమ్ పదో క్రికెటర్‌గా నిలిచాడు. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న నాటికి మర్క్రమ్ వయసు 23 ఏళ్ల 123 రోజులు. కెప్టెన్సీ విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సౌతాఫ్రికా బోర్డుకు కూడా కొత్త కాదు.
దక్షిణాఫ్రికా తరుపున కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పిన్న వయస్కుల్లో గ్రేమ్ స్మిత్ అగ్రస్ధానంలో ఉన్నాడు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన నాటికి గ్రేమ్ స్మిత్ వయసు 22 ఏళ్ల 71 రోజులు. 2003 వరల్డ్ కప్‌లో వైఫల్యానికి బాధ్యతగా నాటి కెప్టెన్ షాన్ పొలాక్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోగా జట్టులో కొత్త కుర్రాడు అయిన గ్రేమ్ స్మిత్‌కు బోర్డు అవకాశం ఇచ్చింది.
అప్పటి జట్టులో గిబ్స్, డిపెనర్ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, వాళ్లను కాదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్మిత్‌కు అవకాశం ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత గ్రేమ్ స్మిత్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాకు ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. అటు కెప్టెన్‌గా ఇటు ఆటగాడిగా స్మిత్ ఎంతో ఎదిగాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత ఒకటీ రెండు మ్యాచ్‌ల అనుభవంతో మరికొంత మంది ఈ తరహాలో కెప్టెన్సీ పగ్గాలను చేపట్టారు. ఈ జాబితాలో మొదటి వాడు లీ జెర్మన్. న్యూజిలాండ్‌కు చెందిన లీ జెర్మన్ తన రెండో వన్డేతోనే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. భారత్ మ్యాచ్‌లోనే అతడికి ఆ అవకాశం వచ్చింది.
1995లో ఇది జరిగింది. ఆ తర్వాత 1997 ఇంగ్లాండ్ ఆటగాడు అడామ్ హోలియక్ తన ఆరో వన్డేతో కెప్టెన్ అయ్యాడు. ఆ మ్యాచ్ కూడా ఇండియాతో జరిగింది కావడం గమనార్హం. అయితే, 2006లో జింబాబ్వే బోర్డు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన టెర్రీ డఫిన్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది.
2006లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో డఫిన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత వెస్టిండీస్ ఆటగాడు ఫ్లాయిడ్ రీఫర్ తన మూడో వన్డేతోనే కెప్టెన్ అయ్యాడు. 2009లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడికి ఈ అవకాశం వచ్చింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.