
ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (2 - 1) తేడాతో ఆస్ట్రేలియా వశమైంది. ఇక తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా.. మూడోదైన చివరి టీ20 మ్యాచ్ కూడా గెలిచి శ్రీలంక గడ్డపై శ్రీలంక జట్టు మీద వైట్ వాష్ చేయాలని చూసింది. ఇక అనుకున్నట్లే మూడో మ్యాచ్‌లో దాదాపు రెండో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వరకు ఆస్ట్రేలియా సులువుగా గెలిచేటట్టే కన్పించింది. ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనుకున్న తరుణంలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తన అరివీర భయంకర బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా నుంచి విజయాన్ని లాక్కొని తన జట్టుకు అందించాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి మూడు ఓవర్లలో 59పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పటికే 6వికెట్లు కోల్పోయిన శ్రీలంక గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ షనక దంచుడుకు ఒక బంతి మిగిలి ఉండగానే శ్రీలంక విజయ బావుట ఎగరవేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా 5వికెట్లు కోల్పోయి 176పరుగులు చేసింది. ఇక 177పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 15ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 108పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో దసున్ షనక, చమిక కరుణరత్నే కడవరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఏడో వికెట్‌కు వీరిద్దరు కలిసి 69పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో కెప్టెన్ షనక 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 54పరుగులు చేసి 4వికెట్ల తేడాతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక కేన్ రిచర్డ్‌సన్ వేసిన ఆఖరి ఓవర్‌లో 19పరుగులు చేయాల్సి రాగా.. కెప్టెన్ షనక 2 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి ఒక బంతి మిగిలి ఉండగానే స్కోర్లు సమం చేశాడు. ఆ తర్వాత రిచర్డ్‌సన్ వైడ్ బాల్ వేయడంతో శ్రీలంక గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా షనక నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం షనక మాట్లాడుతూ..'నేను హిట్టింగ్ చేసే ముందు కొన్ని బంతులను డిఫెన్స్ ఆడాను. నేను వికెట్‌ను బాగా అర్థం చేసుకున్నాను. నేను నా వికెట్‌ని ఏమాత్రం అనవసర తప్పిదాలతో ఇచ్చేయలేదు. గెలవాలంటే అందుకు తగ్గ ప్రక్రియ ముఖ్యమైందని భావించి ఆడాను' అని షనక చెప్పాడు. ఇక ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. షనక ఇన్నింగ్స్‌ను 'నమ్మశక్యం కానీ ప్రదర్శన' అంటూ కితాబిచ్చాడు.