హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎంతో మంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్నాడు. బరిలోకి దిగిన తర్వాత ప్రత్యర్ధి బౌలర్ల మనసుని చదివి ఆ దిశగా నడుచుకోవడమే క్రికెట్‌లో విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గమని సచిన్ ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.
ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రచించిన పుస్తకం 'డెమోక్రసీస్ ఎలెవన్- ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ' ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ తన క్రికెట్ కెరీర్‌లోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.

'ఒకసారి దేశవాళి మ్యాచ్‌లో భాగంగా తమిళనాడు-ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. నేను స్ట్రైకింగ్‌లో ఉన్నాను. ఆ సమయంలో తమిళనాడు జట్టు కెప్టెన్ హేమంగ్ బదాని నాకు తమిళ్ అర్ధం కాదు అనుకుని బౌలర్‌కు సూచనలిస్తున్నాడు' అని సచిన్ ఈ సందర్భంగా అన్నాడు.
'బౌలర్‌కు పిన్నాడి, మున్నాడి అని చెప్పడం గమనించాను. దీంతో, నేను రెండు అడుగులు క్రీజు బయటికి వచ్చాను. మళ్లీ బౌలర్‌కు ఏదో చెప్పాడు. దానికి అనుగుణంగా నేను మళ్లీ క్రీజులో మారాను. అయితే తమిళ్ నాకెలా అర్ధమైందో బదానీకి అర్ధంకాలేదు' అని సచిన్ అన్నాడు.
'సుమారు 15 ఏళ్లు భారత డ్రస్సింగ్ రూమ్‌లో గడిపాను. ఆ సమయంలో చెన్నై నుంచి వచ్చిన ఆటగాళ్లు ఉన్నారు. వారితో అప్పుడప్పుడు మాట్లాడటం ద్వారా కొంచెం తమిళ్ నేర్చుకున్నాను. మున్నాడి (ముందుకు), పిన్నాడి(వెనక్కి) పదాలు నాకు బాగా పరిచయం. బదానీ కూడా ఆ పదాలే అప్పుడు వాడాడు' అని సచిన్ వివరించాడు.
ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ కెప్టెన్లు సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, అజహరుద్దీన్‌లతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. సచిన్ చెప్పిన ఈ వీడియోను హేమాంగ్ బదానీ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.