
బర్మింగ్‌హామ్: గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడంపై సీనియర్లు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాయుడు అర్ధాంతరంగా తన కేరీర్‌కు ముగింపు పలికాడని వ్యాఖ్యానిస్తున్నారు. టీమిండియా మాజీ టెస్ట్ ఆటగాడు, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ షాక్‌ను వ్యక్తం చేశారు. అంబటి రాయుడు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడని తాను ఊహించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం సైతం అనూహ్యమైన ట్వీట్ చేసింది.
సారీ రాయుడూ!
అంబటి రాయుడు బాధను, కోపాన్ని తాను అర్థం చేసుకోగలనని వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తన ట్వీట్‌లో ఆయన కోపం అనే పదాన్ని ప్రయోగించడం.. ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఎంపికైన జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం వల్లే అంబటి రాయుడు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సెలెక్టర్ల దృష్టిలో పడటానికి అతను తీవ్రంగా శ్రమించాడని పేర్కొన్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ముందు- మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. రాయుడికి ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఎంపికైన జట్టులో చోటు దక్కకపోవడం నిరాశకు గురి చేసి ఉంటుందని అన్నారు. అతని సెకెండ్ ఇన్నింగ్ సుఖసంతోషాలతో గడవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు వీవీఎస్ లక్ష్మణ్.
ఇది నిజం కాకూడదని..
అంబటి రాయుడు రిటైర్‌మెంట్ సమాచారం తెలుసుకున్న వెంటనే చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ప్రస్తుతం అంబటి రాయుడు చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోకూడదని కోరుకుంది. ఈ వార్త నిజం కాకూడదని తాను కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఓ సింగిల్ లైన్ ట్వీట్‌ను సంధించింది సీఎస్‌కే. రాయుడు తీసుకున్న నిర్ణయం తమ జట్టుకు విఘాతంలా మారుతుందని అభిప్రాయపడింది.