
ముంబై: భారత జట్టు ప్రధాన కోచ్‌గా కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మరోసారి శాస్త్రికే ఓటేశారు. గత రెండేండ్లుగా భారత ప్రధాన కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి శుక్రవారం తిరిగి రెండేండ్ల కాలానికి కోచ్‌గా ఎంపికయ్యారు. శాస్త్రిని తిరిగి ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న తరుణంలో సీఏసీ చిత్తశుద్ధిపై మరో వివాదం వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ అధికారిక ప్రకటనలో.. సీఏసీ కమిటీ చేసిన పొరపాటుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
తొలి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల పేర్లను బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్ పేరును సీఏసీ తప్పుగా పేర్కొంది. దీంతో ఇంటర్వ్యూల ప్రక్రియపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను మోసం చేయడానికే ఇంటర్వ్యూలు చేశారని ఓ అభిమాని మండిపడ్డాడు. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన మైక్‌హెసన్, టామ్ మూడీ పేర్లను ఎందుకు ప్రస్తావించారని మరో అభిమాని ప్రశ్నించాడు. ఇంటర్వ్యూల పేరుతొ ప్రజలను మోసం చేయడమే కాకుండా.. తప్పులు కూడా రాస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవేళ సీఏసీ ముందే నిర్ణయించిన రవిశాస్త్రి పేరొక్కటే ప్రకటించి ఉంటే సరిపోయేదని విమర్శిస్తున్నారు. సీఏసీకి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదన్నట్లు తెలుస్తోంది, అభ్యర్థుల పేరు తెలవకపోతే గూగుల్‌లో అయినా సెర్చ్ చేయాలి కదా!!, ఇతరులను ఇంటర్వ్యూలకు పిలవడంలో నిజాయతీ ఉందా?, కపిల్‌దేవ్ కమిటీ చెత్త నిర్ణయం తీసుకుందని అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కపిల్‌దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడైన క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రిని తిరిగి కోచ్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మైక్‌హెసన్, టామ్ మూడీలు రవిశాస్త్రికి గట్టి పోటీ ఇచ్చినా.. సీఏసీ మరోసారి శాస్త్రికే ఓటేశారు.