
అసోంలో ఉద్రిక్త పరిస్థితులు
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలో ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏకి వ్యతిరేకంగా అసోంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగుతునాయి. దాదాపు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిరనసల్లో హింసకు పాల్పడ్డారంటూ 190 మందిని అరెస్టు చేశారు. దీంతో ప్రస్తుతం అసోం మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది.

సీఏఏపై కోహ్లీ కామెంట్స్:
శనివారం విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 'సీఏఏ విషయంలో నేను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాలనుకోవడం లేదు. ప్రభుత్వం ఇరు వర్గాల అభిప్రాయాలను పరిగణించాల్సి ఉంటుంది. ఈ అంశంపై నాకు పూర్తి వివరాలు తెలియవు. ఇలాంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం చెప్పడం సరైంది కాదు. అయితే గువాహటి సురక్షితమైన నగరం అని తెలుసు. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. తమ భద్రతకు వచ్చే ముప్పేమీ లేదు' అని కోహ్లీ తెలిపాడు.

ఐసీసీ ప్రతిపాదనపై విముఖత
టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెంచేందుకు ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతిపాదనపై కోహ్లీ విముఖత వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచన సరైంది కాదన్నాడు. 'డే-నైట్ టెస్టులో ఏమైనా మార్పు తీసుకొచ్చి మరింత ఆసక్తికరంగా మార్చడానికి యత్నిస్తే బాగుంటుంది. డే-నైట్ టెస్టు విజయవంతం కావడంతో దానిపై కసరత్తు చేస్తే బాగుంటుంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను ఒక రోజుకు తగ్గించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

కోహ్లీకి గాయం
తొలి టీ20కి ముందు టీమిండియాకు కాస్త ఇబ్బందిపెట్టే ఘటన జరిగింది. శనివారం ప్రాక్టీస్ చేస్తుండగా.. కోహ్లీ వేలికి దెబ్బ తగిలింది. సాధనలో భాగంగా క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఎడమ చేతి చిటికెన వేలుకు బంతి బలంగా తాకింది. దీంతో టీమ్ ఫిజియో నితిన్ పటేల్ అతడికి ప్రథమ చికిత్స చేశాడు. అయితే గాయం తీవ్రత పెద్దగా లేకపోవడంతో మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది.


Click it and Unblock the Notifications
