

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో గురువారం ఆరంభమైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 64 పరుగులతో రాణించాడు.
ఈ సిరిస్‌లో విరాట్ కోహ్లీకి ఇది రెండో రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అంతకముందు ఇదే మైదానంలో ఆదివారం ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో 41 బంతుల్లో 61 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే, వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ వేషధారణ సోషల్ మీడియాలో విమర్శలకు తావిచ్చింది.
నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో వర్షం కారణంగా బుధవారం తొలిరోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షార్ట్ ధరించి మైదానంలోకి వచ్చాడు. వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ క్రికెటర్లు టెస్టు డ్రెస్సులోనే ఆడతారు.
అయితే, టాస్ వేసే సమయంలో కోహ్లీ ఇలా షార్ట్ ధరించి రావడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కోహ్లీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు కెప్టెన్ శామ్ వైట్‌మాన్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఓపెనర్ పృథ్వీ షా (66: 69 బంతుల్లో 11 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (64: 87 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), పుజారా (54: 89 బంతుల్లో 6 ఫోర్లు) రహానే (56 రిటైర్డ్ ఔట్), హనుమ విహారి (53) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది.