
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపించేందుకు గాను క్రికెట్ ఆస్ట్రేలియా ఛీప్ జేమ్స్ సదర్లాండ్ దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడటం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన సంగతి తెలిసిందే.
బాల్ టాంపరింగ్‌ను ప్రోత్సహించి, సహచర క్రికెటర్‌తో తప్పు చేయించినందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించింది. ఇక టాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో జత చేసింది.
దీనికి మందు క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించగా.. డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్సీ తనకు తానుగా వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అస్ట్రేలియా స్పోర్ట్స్‌కమిషన్(ఏఎస్‌సీ)కు చెందిన బోర్డు ఇంటిగ్రిటీ హెడ్ ఇయాన్ రాయ్, టీమ్ పర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్ దక్షిణాఫ్రికాకు చేరుకుని విచారణ ప్రారంభించారు.
వీళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్, కోచ్ డారెన్ లీమన్‌తో మాట్లాడారు. విచారణ పూర్తయిన తర్వాత వీరిపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఇద్దరూ క్రికెట్ ఆస్ట్రేలియాకు సిఫారసు చేయనున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బుధవారం వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
శుక్రవారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కి ముందే విచారణ పూర్తి చేస్తామని తెలిపారు. అయితే, ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటున్న స్మిత్ ఇంకా దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. సీఏ అధికారులు దీనిపై విచారించేందుకు దక్షిణాఫ్రికా వచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు స్మిత్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడని తెలిపారు.
క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిబంధనల ప్రకారం మోసానికి పాల్పడిన క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ అభిమానులు సైతం వీళ్లిద్దరిపై జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది.
మూడో టెస్టులో సీనియర్ ఆటగాళ్లు అందరం కలిసి బాల్ టాంపరింగ్ చేయాలని ప్లాన్ నిర్ణయించినట్లు స్మిత్ చెప్పడంతో కెప్టెన్, వైస్ కెప్టెన్‌లకు వీలైనంత ఎక్కువ శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మీడియా సమావేశంలో తాము చేసిన తప్పును అంగీకరించినప్పటికీ ఐసీసీ ఔదార్యం చూపించడాన్ని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌ను ప్రోత్సహించి, సహచర క్రికెటర్‌తో తప్పు చేయించినందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. టాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో చేర్చింది.