
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ ఏమాత్రం కనికరం లేకుండా ఢిల్లీ బౌలర్లపై దండయాత్రకు దిగాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా ఉతికి ఆరేశాడు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా.. తన బ్యాట్‌తో ఒకేరకమైన పనిష్‌మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ ఐపీఎల్లో 57బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బట్లర్ ( 116పరుగులు 65బంతుల్లో 9ఫోర్లు, 9సిక్సర్లు) ఊర మాస్ ఇన్నింగ్స్‌కు తోడు.. దేవదత్ పడిక్కల్ (54పరుగులు 35బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) టెర్రిఫైయింగ్ హాఫ్ సెంచరీ, కెప్టెన్ సంజూ శాంసన్ (46పరుగులు 19బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు నాటౌట్) వీర బాదుడు దెబ్బకు స్కోరు బోర్డు తుఫాన్ వేగంతో ఉరకలేసింది.
టాస్ ఓడిన రాజస్థాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్లు జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ జోడీ ఆది నుంచే హిట్టింగ్ మొదలెట్టారు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే బట్లర్ రెండు ఫోర్లు కొట్టి బౌండరీల మోత మొదలెట్టగా.. ముస్తాఫిజుర్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి దేవదత్ పడిక్కల్ సైతం జోరందుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 10ఓవర్లో బట్లర్ 107మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో 36బంతుల్లో 50పరుగులు చేసిన బట్లర్.. తన ధ్వంసరచనను మరింత తీవ్రం చేశాడు. 11ఓవర్లలోనే ఓపెనింగ్ భాగస్వామ్యం 100దాటింది.
లలిత్ యాదవ్ వేసిన 13ఓవర్లో బట్లర్ రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టగా ఆ ఓవర్లో 18పరుగులొచ్చాయి. ఇదే అదనులో 31బంతుల్లోనే పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 15ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్‌కు బట్లర్ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఈ ఓవర్లోనూ 105మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. 16ఓవర్లో దేవదత్ పడిక్కర్ ఔట్ అయ్యాడు. అదే ఓవర్లో బట్లర్ 57బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. దేవదత్ పడిక్కల్ ఔటయ్యాడనకుంటే ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ దిగి పెను విధ్వంసం రేపాడు.
ఖలీల్ అహ్మద్ వేసిన 18ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో శాంసన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను ఖలీల్ జారవిడవడం ఢిల్లీకి శాపంగా మారింది. 19ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ 14పరుగులు ఇచ్చినా బట్లర్‌ను ఔట్ చేశాడు. కానీ అప్పటికే బట్లర్ చేయాల్సినంత విధ్వంసం చేసేశాడు. ఇక చివరి ఓవర్లో శాంసన్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా మొత్తం 20పరుగులొచ్చాయి. దీంతో 20ఓవర్లు పూర్తయ్యేసరికి 2వికెట్లు కోల్పోయి రాజస్థాన్ 222పరుగుల భారీ స్కోరు చేసింది.