
లండన్: టెస్టు క్రికెట్‌లో సెంచరీ అనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టు బౌలర్లను ధీటుగా ఎదుర్కొని చేసిన సెంచరీ అయితే ఇంకా ప్రత్యేకం. ఆ సెంచరీ ఏ క్రికెటర్‌కైనా జీవితాంతం గుర్తిండిపోతుంది. అలాంటి సెంచరీనే నాటింగ్‌హామ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ సాధించాడు.
ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియంలో జోస్ బట్లర్ చేసిన సెంచరీ చరిత్రలో అలా నిలిచిపోతుంది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైనప్పటికీ, జోస్ బట్లర్ ఆడిన ఇన్నింగ్స్ స్పూర్తిదాయకం. 521 పరుగుల భారీ లక్ష్యంతో మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ 62 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది.
అలాంటి పరిస్థితుల్లో బెన్ స్టోక్స్ (62; 187 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి బట్లర్ (106; 176 బంతుల్లో 21 ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌ను ఏకంగా 169 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బట్లర్ క్రీజులో ఉన్నంత వరకు ఇంగ్లాండ్‌ను ఓటమి అంచుల నుంచి తప్పంచే ప్రయత్నం చేశాడు.
అయితే, భారత బౌలర్ బుమ్రా (5/85) చెలరేగడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్లు నష్టపోయి 311 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా ఒక్క వికెట్ దూరంలో మాత్రమే ఉంది. మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ మీడియాతో మాట్లాడుతూ "చాలా సంతృప్తికరంగా ఉంది. సెంచరీ సాధించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని చెప్పుకొచ్చాడు.
"కొన్ని నెలల క్రితం నాకు ఇదో మిలియన్ మైళ్ల దూరం. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫీలింగ్‌ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడంలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నా ఎక్కడో చిన్న వెలితి. నన్ను నేను నిరూపించుకోవడం అనేది కచ్చితంగా గొప్ప ఫీలింగ్. కానీ నా ప్రతిభ జట్టు విజయానికి తోడ్పడితే అది మరింత ఆనందాన్ని ఇస్తుంది" అని బట్లర్ అన్నాడు.
టెస్టుల్లో బట్లర్‌కు ఇది తొలి సెంచరీ. బట్లర్ తన పేలవ ఆటతీరుతో 2015 అక్టోబర్‌లో ఇంగ్లాండ్ టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అతని స్థానాన్ని ప్రస్తుత వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో భర్తీ చేశాడు. అటు వికెట్ కీపర్‌గా బ్యాట్స్‌మన్‌గా బెయిర్‌స్టో రాణిస్తుండటంతో తుది జట్టులో అతడి స్థానం సుస్థిరమైంది.
ఇక టెస్టు జట్టులోకి బట్లర్ రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఈ ఏడాది ఐపీఎల్ అతడికి ఎంతగానో కలిసొచ్చింది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించడంతో ఈ ఏడాది మేలో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ కోసం బట్లర్‌కు పిలుపొచ్చింది. ఈ అవకాశాన్ని బట్లర్ సద్వినియోగం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సత్తా చాటుతున్నాడు.