
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియలో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 416పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా చివర్లో ఆడిన ఆటే హైలెట్ అని చెప్పాలి. బుమ్రా 16 బంతుల్లో 31పరుగులు చేసి స్కోరు బోర్డు నాలుగొందలు దాటించాడు. ఇక కెప్టెన్సీ తెచ్చిన ఉత్సాహంతో అతను ఓ ప్రొఫెషనల్ బ్యాటర్ కూడా సాధించని అనూహ్యమైన రికార్డు సాధించాడు. ఒకే ఓవర్లో 29పరుగులు చేశాడు. టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక బుమ్రా చెలరేగడానికి తోడు వైడ్, నోబ్, ఎక్స్ ట్రా ఫోర్ కూడా దక్కడంతో ఏకంగా ఒక్క ఓవర్లోనే 35పరుగులు వచ్చాయి.
బుమ్రా విధ్వంసకాండ ఇలా..
టీ20 ఫార్మాట్‌లాగా బుమ్రా చెలరేగి ఆడాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన స్టువర్ట్ బ్రాడ్ 84ఓవర్ బంతి అందుకున్నాడు. ఆ ఓవర్ తొలి బంతికి బుమ్రా బౌండరీ సాధించాడు. రెండో బంతి వైడ్ ప్లస్ ఫోర్‌గా వెళ్లింది. దీనితో అయిదు పరుగులు ఎక్స్‌ట్రాగా వచ్చాయి. ఆ తరువాతి బంతి నో బాల్. దాన్ని సిక్స్‌గా మలిచాడు బుమ్రా. ఆ ఒక్క బంతికే అరుదుగా ఏడు పరుగులొచ్చాయి. దీంతో ఒక్క బంతికి 16పరుగులు వచ్చినట్లయింది. ఇక 2, 3, 4బంతులను ఫోర్లు కొట్టిన బుమ్రా అయిదో బంతికి సిక్సర్ బాదాడు. చివరి బంతికి సింగిల్ తీశాడు. దీంతో మొత్తం 35పరుగులొచ్చాయి. టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో ఇన్నేసి పరుగులు రాబట్టుకోవడం ఇదే తొలి సారి. మొత్తంగా 416పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్‌కు తెర పడింది.
మన దిగ్గజాలు బుమ్రాపై ఎలా ట్వీట్ చేశారంటే..
ఇక బుమ్రా బ్యాటింగ్ ప్రదర్శన మీద దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టరులో స్పందిస్తూ.. అరె ఏంటీ బ్యాటింగ్ చేస్తుంది బుమ్రానా లేకా యువీనా అని సందేహపడుతూ ట్వీట్ చేశాడు. ఇక మరో టీమిండియా మాజీ టెస్ట్ ప్లేయర్ వసీం జాఫర్ సైతం.. స్టువర్ట్ బ్రాడ్ మీద ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేశాడు.
కమల్ చేశావ్ కెప్టెన్ సాబ్
ఇక టర్బునేటర్ హర్భజన్ సైతం ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. కమల్ చేశావ్.. కెప్టెన్ సాబ్ అంటూ ప్రశంసించాడు. ఇక టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. స్టువర్ట్ బ్రాడ్ పాత కొత్త ఫోటోలను పక్కపక్కనే పెట్టి.. పాత అలవాట్లు ఇంక పోనట్టుంది అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ అయితే స్టువర్ట్ బ్రాడ్‌ను ఉద్దేశించి.. 'నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి డేంజరేస్ సిచువేషన్లో నేనే ఎందుకుంటాను' అనే క్యాప్షన్‌తో ఓ మీమ్ పోస్ట్ చేశాడు. ఇంకా నెటిజన్లు అయితే ట్వీట్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారనుకోండి.
తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్