ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (196; 278 బంతుల్లో) త్రుటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ను పోప్ మెరుగైన స్థితిలో నిలిపాడు. అతడి పోరాటంతో భారత్‌కు ఇంగ్లాండ్ 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. బుమ్రా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
ఓవర్‌నైట్ స్కోరు 316/6తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమిండియా బౌలర్లను గొప్పగానే ఎదుర్కొంది. అయితే ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెహాన్ అహ్మద్ (28; 53 బంతుల్లో)ను బుమ్రా బోల్తాకొట్టించాడు. బుమ్రా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన రెహాన్ వికెట్‌కీపర్ చేతికి చిక్కాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ హర్ట్లీ (34; 52 బంతుల్లో) కలిసి పోప్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కానీ, హర్ట్లీని అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేసి దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కుప్పకూలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 12 బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోయింది. రివర్స్ స్కూప్‌కు ట్రై చేసిన పోప్ బుమ్రా బౌలింగ్ క్లీన్‌బౌల్డ్ అయ్యి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే ఓ దశలో ఇంగ్లాండ్ 163 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది. కానీ, పోప్ ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.

బెన్ ఫోక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కు 112 పరుగులు, రెహాన్ అహ్మద్‌తో కలిసి ఏడో వికెట్‌కు 64, ఎనిమిదో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా, టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, అశ్విన్ మూడు, జడేజా రెండు, అక్షర్ ఒక్క వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 436 పరుగులు సాధించి 190 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.