టీమిండియా విజయోత్సవ ర్యాలీ అద్వితీయంగా ముగిసింది. వేలాది అభిమానుల మధ్య, పూల వర్షంలో భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి వైభవంగా తరలివెళ్లారు. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేనకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. విశ్వవిజేతలకు స్వాగతం పలకాలని అభిమానులు భారీగా తరలిరావడంతో మెరైన్‌డ్రైవ్ జనసంద్రాన్ని తలపించింది. విక్టరీ పరేడ్‌లో ఓపెన్ టాప్ బస్సులో భారత ఆటగాళ్లు కప్‌ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేశారు.
అనంతరం వాంఖడే స్టేడియంలోనూ టీమిండియా అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. మరోవైపు టీమిండియాకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. భారత ఆటగాళ్లను, కోచింగ్ స్టాఫ్‌ను బీసీసీఐ సత్కరించింది. అంతేగాక రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ చెక్ అందజేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, కోచ్ రాహుల్ ద్రవిడ్ భావోద్వేగంతో మాట్లాడారు.

ఆ తర్వాత ఆటగాళ్లంతా కలిసి డ్యాన్స్ వేస్తూ అభిమానులను అలరించారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ కలిసి మాస్ డ్యాన్స్ వేశారు. సూర్య, హార్దిక్, దూబె, జైస్వాల్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సందడి చేశారు. ఆఖర్లో మైదానం చుట్టూ తిరుగుతూ వరల్డ్ కప్‌ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. ఈ క్రమంలో స్టేడియంలో 'వందేమాతరం' సాంగ్ ప్లే అయ్యింది.
అభిమానులతో కలిసి భారత జట్టు ఆటగాళ్లంతా వందేమాతరం పాడారు.ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అయితే అందరూ ఓ రిథమ్‌లో పాడుతున్న సమయంలో హార్దిక్ పాండ్యకు అభిమానుల నుంచి ఊహించని గిఫ్ట్ వచ్చింది. పాటలో లీనమవుతూ హార్దిక్ పాండ్య చేతులూ చాపుతూ గానం చేయగా... ఆ సమయంలో ఒక్కసారిగా స్టాండ్స్ నుంచి టీషర్ట్ హార్దిక్ చేతుల్లోకి వచ్చింది. వెంటనే దాన్ని కిందపడేసి హార్దిక్ పాడటం కొనసాగించాడు.
మరోవైపు దీన్ని గమనించిన బుమ్రా మాత్రం నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. విరగబడి నవ్వాడు. అయితే అంతమంది ఆటగాళ్లలో హార్దిక్‌కు మాత్రం ఆ టీషర్ట్ చేరడంపై నెట్టింట్లో ఫన్నీగా మీమ్స్ వస్తున్నాయి. కాగా, గత ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న హార్దిక్‌కు అభిమానుల నుంచి హేళన ఎదురైంది. కానీ నెలలోనే అంతా మారిపోయింది. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో హార్దిక్ కీలకపాత్ర పోషించడంతో విమర్శించిన వాళ్లే తిరిగి పొగుడుతున్నారు.