

హైదరాబాద్: భుజం గాయం నుంచి కోలుకుంటున్న పేసర్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. టోర్నీలో భాగంగా ఆదివారం డిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ చివరి బంతికి బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ చివరి బంతికి రిషబ్ పంత్ కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నం చేయగా బుమ్రా ఎడమ చేయి సహకరించలేదు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
దీంతో నొప్పితో తన ఎడమ భుజాన్ని పట్టుకున్న బుమ్రా మైదానంలోనే కప్పుకూలాడు. అంతేకాదు ముంబై ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మిగిలినా బుమ్రా బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రాలేదు. దీంతో బుమ్రా గాయంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది మే30న ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇలాంటి సమయంలో బుమ్రా గాయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బుమ్రాకు ఏం కాలేదని, అతని గాయం గురించి భయపడాల్సిన అవసరం లేదని ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
దీంతో సోమవారమే ఆ జట్టు బెంగళూరు చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే, బుమ్రా సోమవారం జట్టుతో కలిసి రాకుండా మంగళవారం బెంగళూరు చేరుకున్నాడు. అనంతరం జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నప్పటికీ... నెట్స్‌లో బౌలింగ్ మాత్రం చేయలేదు. సహచరులతో కలిసి వామప్‌లో పాల్గొన్న బుమ్రా.. కాసేపు క్యాచింగ్ సాధన చేశాడు.