హైదరాబాద్: ఐసీసీ మంగళవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకి అందుకున్నాడు. తాజాగా, ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్ధానంలో నిలిచాడు.
సోమవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానంలో నిలిచిన బుమ్రా, టీ20ల్లో అగ్రస్ధానంలో నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన స్పిన్నర్ ఇమాద్ వసీమ్ ఒక స్ధానం దిగజారడంతో బుమ్రా ఆ స్ధానాన్ని ఆక్రమించాడు. బుమ్రా 729 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్ధానంలో నిలవగా, ఇమాద్ 719 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
ఇక, టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్ధానంలో నిలిచాడు. వన్డేల్లో తిరిగి నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్న కోహ్లీ, టీ20ల్లో కూడా తన ర్యాంకును కాపాడుకున్నాడు. కోహ్లీ 811 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్ధానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు.
జట్ల పరంగా టీ20 ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 1 నుంచి మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. సిరిస్‌లో భాగంగా జరగనున్న తొలి టీ20కి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఇదిలా ఉంటే, కివీస్‌తో జరిగే మూడు టీ20ల సిరిస్‌ను భారత గెలిస్తే కనుక తన ర్యాంకును మరింత మెరుగు పరుచుకుంటుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో ఐదో స్ధానంలో ఉన్న భారత్ మూడు టీ20ల సిరీస్‌ను గెలిస్తే ర్యాంకింగ్స్‌లో రెండో స్ధానానికి చేరుతుంది. ఇదే గనుక జరిగితే పాకిస్థాన్ టీ20ల్లో అగ్రస్ధానానికి ఎగబాకుతుంది.
మూడు టీ20ల సిరిస్‌ను భారత్ గెలవడం ఫలితంగా ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తన ర్యాంకును కోల్పోతుంది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న పాకిస్ధాన్ అగ్రస్ధానానికి చేరుతుంది.