న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేకు బ్రిటిషన్ ఎయిర్ వేస్ క్షమాపణలు చెప్పింది. లగేజీని లండన్‌లోనే ఉంచినందున క్షమాపణలు కోరింది. భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వారు లండన్ మీదుగా సెయింట్ కిట్స్ వెళ్లారు.
వీరు ముంబై నుంచి లండన్ మీదుగా సెయింట్ కిట్స్ వెళ్లారు. లండన్‌లోని గాత్విక్ విమానాశ్రయంలో స్వల్ప విరామం కోసం విమానం ఆగింది. ఆ సమయంలో బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది కుంబ్లే బ్యాగులను అక్కడే వదిలేశారు.

దీంతో కుంబ్లే కిట్ బ్యాగ్, దుస్తులు తదితరాలన్నీ గాత్విక్‌లో ఉండిపోయాయి. ఆయన మాత్రం జట్టుతో కలిసి సెయింట్ కిట్స్ చేరుకున్నారు. ఆ తర్వాత తన లగేజీ కోసం ఫిర్యాదు చేయగా బ్రిటీష్ ఎయిర్ వేస్ స్పందించింది.
జరిగిన తప్పుకు క్షమించాలని, మీ బ్యాగ్స్ సెయింట్ కిట్స్‌కు చేరలేదని, ఇవి గాత్విక్‌లో ఉండిపోయాయని, మీ లగేజీని మీకు సాధ్యమైనంత త్వరగా అందిస్తామని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది. కాగా, గతంలో ఓసారి సచిన్ టెండుల్కర్ సైతం సిబ్బంది సేవలు బాగాలేవని, వారి 'డోంట్ కేర్' దృక్పథం తనకు నచ్చలేదని చెప్పిన విషయం తెలిసిందే.