
రషీద్ ఖాన్ గణాంకాలు.. అతను ఎలాంటి బౌలరో చెబుతాయి. గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న రషీద్ ఖాన్.. ఐపీఎల్లో డ్వేన్ బ్రావో (179 వికెట్లు, 158 మ్యాచ్‌లు), లసిత్ మలింగ (170 వికెట్లు, 122 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (149వికెట్లు, 142 మ్యాచ్‌లు) తర్వాత 100వికెట్లు తీసిన నాలుగో విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు. అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రాతో పాటు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (83 మ్యాచ్‌లలో) 100వికెట్లు సాధించిన మూడో ఆటగాడిగాను రికార్డ్ నెలకొల్పాడు.
శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4ఓవర్లలో 2/22ప్రదర్శనతో ఐపీఎల్‌లో 100వికెట్లు తీసిన 16వ బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డులకెక్కాడు. ఇక ఐపీఎల్లో 2017 నుంచి 2021వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రషీద్ ఖాన్ ఆడాడు. తన అద్భుత బౌలింగ్‌తో సూపర్ స్టార్ అయ్యాడు. సన్‌రైజర్స్‌కు ఆడిన 5సీజన్లలో రషీద్ 76మ్యాచ్‌లలో 93వికెట్లతో రాణించాడు. 2022లో సన్ రైజర్స్ రషీద్‌ను వదులుకోగా.. గుజరాత్ టైటాన్స్ అతన్ని రూ.15కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రషీద్‌ఖాన్ లేకున్నా తమ జట్టు బాగా రాణిస్తోందన్నాడు. "రషీద్ ఖాన్ అంటే నాకు చాలా గౌరవముంది. కానీ అతను లేకున్నా మాకు సరైన ప్లేయర్లతో సమతూకం ఉందని నమ్ముతున్నా. రషీద్ ఖాన్ బౌలింగ్లో బ్యాటర్లు డిఫెన్స్ ఆడడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. కానీ అతను పెద్ద వికెట్ టేకరేం కాదు." అని లారా పేర్కొన్నాడు.

అయినా పర్లేదు మాకు శ్రేయాస్ గోపాల్ కూడా ఉన్నాడు. అతను ఇప్పటివరకు ఒక్క గేమ్ ఆడకున్నా.. ఐపీఎల్‌లో అతను హ్యాట్రిక్ సాధించిన విషయం మర్చిపోకూడదు. ఐపీఎల్లో మా సత్తాను చాటడానికి ఇంకా సమర్థులైన ప్లేయర్లు మా రిజర్వ్ బెంచ్‌లో ఉన్నారు. దీని వల్ల రషీద్ లేకున్నా మాకు పెద్దగా ఆందోళనేం లేదు. రషీద్ ఖాన్ జట్టులో సభ్యుడిగా ఉంటే సంతోషించేవాడిని.. అతను ఉంటే మేము ఏడు మ్యాచుల్లో ఏడు గెలిచి ఉండవచ్చేమో.. అని లారా పేర్కొన్నాడు.