హైదరాబాద్: తన ఆటతీరుతో ఎన్నో రికార్డులను సృష్టించిన వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియానా లారా హైదరాబాద్ పర్యటన తనకు మధురానుభూతులను మిగుల్చిందని చెప్పాడు. హైదరాబాద్ గోల్కొండ గోల్ఫ్‌కోర్స్‌లో రెండు రోజులు జరిగిన లారా విశాఖ కప్ టోర్నీలో పాల్గొనేందుకు లారా నగరానికి వచ్చాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెస్టిండీస్ క్రికెట్లో రాజకీయాలు ఎక్కువని చెప్పాడు. ముఖ్యంగా అనుభవం కలిగిన వారు వెస్టిండిస్ బోర్డుని నడిపించకపోవడం వల్లే వెనుకబడిందని, భవిష్యత్తులో పూర్వవైభవం అందుకుంటుందని లారా ఆశాభావం వ్యక్తం చేశాడు.
హైదరాబాద్ ఆతిథ్యం ఎంతగానో నచ్చిందని అన్నాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ యువతకు స్ఫూర్తి నిచ్చారని లారా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియా అద్భుతంగా ఆడుతోందని, స్వదేశంలో టీమిండియా ఎప్పుడూ బలమైన జట్టేనని చెప్పాడు. టీమిండియా ఆటలో పరిణితి కనిపిస్తోందని అన్నాడు.

ఇక, సచిన్ విషయానికి వస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు. సచిన్ జట్టులో ఉన్నప్పుడే ఇప్పుడున్న ఆటగాళ్లు ఎదిరగారని, ప్రస్తుతం టీమిండియా అద్భుతంగా ఆడటానికి కారణం సచినే అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడని లారా తెలిపాడు.
ప్రస్తుత జనరేషన్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్ లాంటి ఆటగాళ్లు క్రికెట్‌కు వన్నె తెస్తున్నారని పేర్కొన్నాడు. కెప్టెన్సీ విషయంలో ధోనితో పోలిస్తే కోహ్లీ భిన్నంగా ఉన్నాడని లారా అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్‌తో అత్యున్నత స్థాయికి కోహ్లీ చేరాడని చెప్పాడు. తన ఆటతీరుతో అందరి మన్ననలు పొందుతున్నాడని అన్నాడు.