హైదరాబాద్: ఆస్ట్రేలియన్ క్రికెటర్లలో భారత అభిమానులు ఎంతో అమితంగా ఇష్టపడే క్రికెటర్లలో మాజీ పేసర్ బ్రెట్ లీ ఒకడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఒకానొక సందర్భంలో భారత్‌ను తన రెండో ఇంటిగా భావిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
90 దశకాల్లో చురకత్తుల్లాంటి బంతులతో ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. తాజాగా, ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బ్రెట్‌లీ కామెంటేటర్‌గా వహరిస్తున్నాడు. మ్యాచ్‌ల మధ్య కాస్తంత విరామం లభించడంతో మైసూర్‌లోని కుస్తీ ప్రాక్టీస్ చేసే సెంటర్‌కు వెళ్లాడు.
అక్కడ కుస్తీ నేర్చుకుంటున్న వారితో సరదాగా కొద్దిసేపు తలపడ్డాడు. వారితో కలిసి కసరత్తులు కూడా చేశాడు. ఆ తర్వాత మైసూర్ మహారాజా భవంతిని సందర్శించాడు. రాణి ప్రమోదా దేవిని కలిసి ఆమె కోసం ప్రత్యేకంగా పియానో వాయించాడు. ఈ సంగతుల్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు.