రోహిత్‌తో తొలి మెమొరీ అదే.. నా బౌలింగ్‌లో షాట్ ఆడగా... : బ్రెట్ లీ

సిడ్నీ: కెరీర్ ప్రారంభంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ, దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్ స్టెయిన్ బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండేదని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా స్పష్టం చేసాడు. ప్రస్తుతం తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ఊచకోత కోస్తున్న ఈ ముంబైకర్ మొదట్లో ఈ ఇద్దరు బౌలర్లు ఎదుర్కోవడం సవాల్‌గా ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్‌తో తనకు ఎదురైన తొలి జ్ఞాపకాన్ని బ్రెట్ లీ గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు రోహిత్ లాంటి హార్డ్ హిట్టర్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడనని లీ చెప్పుకొచ్చాడు.

రోహిత్ బ్యాట్ సౌండ్ సూపర్:
స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్‌లో బ్రెట్ లీ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ దూకుడైన క్రికెటర్. ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాడంటే ఆపడం చాలా కష్టం. ఆరంభం నుంచి బంతిని బాదడం ఆరంభిస్తాడు. రోహిత్ తరహా క్రికెటర్లకు నేను ఎప్పుడూ బౌలింగ్ చేయాలనుకోను. నాకు రోహిత్‌తో ఓ మంచి జ్ఞాపకం ఉంది. అది రోహిత్‌తో నా తొలి మెమొరీ అని కూడా చెబుతా. నా బౌలింగ్‌లో రోహిత్ షాట్ ఆడగా.. బ్యాట్ నుంచి వచ్చిన సౌండ్ అదిరిపోయింది. ఆ సౌండ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అది నాకు ఇప్పటికీ జ్ఞాపకమే' అని బ్రెట్ లీ తెలిపాడు.

టాపార్డర్‌లో రోహిత్ ఉంటే:
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మెరుపు బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మ లాంటి ఆటగాడు టాపార్డర్‌లో ఉంటే అస్సలు బౌలింగ్ చేయబోనని బ్రెట్ లీ పేర్కొన్నాడు. రోహిత్ కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్‌లో ఆడేవాడు. 2007 టీ20 ప్రపంచకప్ సమయంలో లీని ఎదుర్కొన్నాడు. 2013లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందాక హిట్‌మ్యాన్ వెనుదిరిగి చూసుకోలేదు. అక్కడి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన హవాను కొనసాగిస్తున్నాడు. ఇక 2012లోనే బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

బ్రెట్ లీతో ఇబ్బంది పడ్డా:
అంతకుముందు బ్రెట్ లీ గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను బ్రెట్ లీ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి నిద్రలేని రాత్రులు గడిపేవాడినని పేర్కొన్నాడు. 'నేను క్రికెట్‌లో అడుగుపెట్టిన రోజుల్లో బ్రెట్‌లీ తన వేగవంతమైన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు బ్రెట్ లీ వేగం చూసి బెదిరిపోయా. లీ నుంచి 150కి.మీ వేగంతో వచ్చే బంతుల్ని ఎలా ఆడాలి అనే విషయంలో చాలా సందిగ్థతకు లోనయ్యేవాడిని. నా అరంగేట్ర వన్డే సిరీస్ కోసం.. ఐర్లాండ్ వెళ్లాను. అక్కడ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్టెయిన్ బౌలింగ్ ఎదుర్కొన్నా. చాలా కష్టంగా అనిపించింది. అప్పట్లో బ్రెట్‌లీ, స్టెయిన్ బౌలింగ్ నాకు చాలా నచ్చింది' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

అత్యుత్తమ వైట్‌బాల్ క్రికెటర్:
ప్రస్తుతం రోహిత్ శర్మ అత్యుత్తమ వైట్‌బాల్ క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గణాంకాలే అతని ధాటిని చాటి చెబుతాయి. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేయగా.. టీ20ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ప్రభంజనమే సృష్టించాడు. ఐదు శతకాలతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రల్లోకెక్కాడు. ప్రపంచకప్‌లో నాలుగు అత్యధిక శతకాలు చేసిన లంక మాజీ ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు. 2007లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన రోహిత్.. టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం ఆరేళ్లు సమయం పట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications