
గత ఎనిమిదేళ్లలో ఇది రెండోసారి మాత్రమే
ఐపీఎల్ 2022లో కోహ్లీ 22.73 సగటుతో కేవలం 341పరుగులు మాత్రమే సాధించాడు. ఈ సీజన్లో చాలా కఠినమైన సవాళ్లు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్లో 400పరుగుల మార్క్‌ను అధిగమించడంలో విఫలమవడం గతన ఎనిమిదేళ్లలో ఇది రెండోసారి మాత్రమే. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20ప్రపంచ కప్‌కు ముందు కోహ్లీ ఇలా డీలాపడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. కోహ్లీ పూర్తి స్థాయిలో తిరిగి ఫాం పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక విరాట్ బ్యాట్ నుండి పరుగులు రాకపోవడం వల్ల కలిగే ప్రభావం ఆర్సీబీపై చాలా ఉంటుందని, అలాగే టీమిండియా మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.

కోహ్లీకి ఇది మంచి అవకాశం
బ్రెట్ లీ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ పరుగులు చేయకపోతే.. ఆ టైంలో తను ప్రాతినిధ్యం వహించే జట్టు కూడా బాగా రాణించదు. కోహ్లీ 2016 సీజన్లో 900పరుగులు చేసినప్పుడు అతని జట్టుచాలా అధ్భుతంగా ఆడింది. లీగ్ దశలో కంప్లీట్ డామినేషన్ చూపించింది. కోహ్లీ ఆడితే జట్టు స్థాయి, పరిస్థితి వేరే రేంజులో ఉంటుంది. కాబట్టి కోహ్లీ నుంచి పరుగులు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీకి ఇదో మంచి టైం. ఎలాగూ ఐపీఎల్ అయిపోయింది. అతను కొన్ని రోజులు క్రికెట్ కాకుండా వేరే విషయాలపై ఫోకస్ పెట్టడానికి, క్రికెట్ నుంచి తగినంత విశ్రాంతి తీసుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. ఇక కొన్ని రోజులు అన్నింటినీ పక్కన పెట్టి మనసును కోహ్లీ కాస్త ఉల్లాసపర్చుకోవాలి' అని బ్రెట్ లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

భారత పేస్ దళాన్ని మెచ్చుకున్న బ్రెట్ లీ
ప్రస్తుత తరంలో భారత ఫాస్ట్ బౌలర్లపై బ్రెట్‌లీ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించే ప్లేయర్లుగా ఇద్దరు ఖాన్‌లను పేర్కొన్నాడు. వారు లక్నో పేసర్లు అయిన మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్. వీరిద్దరు చాలా మంచి ప్రతిభను కలిగి ఉన్నారు. వీరిద్దరూ మంచి ఫాస్ట్ బౌలర్లుగా ఎదిగే అవకాశం ఉంది. అలాగే టీమిండియాకు మంచి స్పిన్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఫాస్ట్ బౌన్సీ వికెట్లపై వేగంగా బౌలింగ్ చేయగల కుర్రాళ్ళు టీమిండియాకు కావాలని' బ్రెట్ లీ సూచించాడు.

ఉమ్రాన్ మాలిక్ టెస్టుల్లో కూడా ఆడాలి
ఐపీఎల్ 2022 సంచలనం ఉమ్రాన్ మాలిక్ టెస్ట్ క్రికెట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నట్లు బ్రెట్ లీ పేర్కొన్నాడు. ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో వేగవంతమైన బంతులు వేయడం మనం చూశాం. అతను 22 వికెట్లు కూడా తీశాడు. అతని దూకుడు పేస్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఉమ్రాన్ మాలిక్ కచ్చితమైన వేగంతో బౌలింగ్ వేయగలడు. అందుకే నేను అతన్ని టెస్ట్ జట్టులో ఎంపిక చేయాలని కోరుకుంటున్నాను.' అని బ్రెట్ లీ చెప్పాడు.