
ఆక్లాండ్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువయ్యాయి. దీని వల్ల లాభపడే వాళ్లతో పాటు నష్టపోయేవాళ్లు తక్కువేం కాదు. పుకార్ల విషయంలో అయితే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా ఈ సోషల్ మీడియా ఓ స్టార్ క్రికెటర్‌ను చంపేసింది. తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ నాథన్ మెక్‌కల్లమ్‌ను సోషల్‌మీడియా వేదికగా చంపేశారు. దీంతో ఆయన అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు అతని మరణానికి సంతాపం తెలియజేస్తూ ట్విట్టర్‌లో సందేశాలను పోస్టు చేశారు.
అయితే, తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై నాథన్ మెక్‌కల్లమ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. దీంతో స్వయంగా అతడే ట్విటర్ వేదికగా తాను బతికే ఉన్నానంటూ అభిమానులకు తెలియజేశాడు. "నేను చావలేదని.. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో సంతోషంగా ఉన్నాను" అని ఓ ట్వీట్ చేశాడు.
అయితే అతని తమ్ముడు, మరో స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం ఈ పుకార్లు చాలా సీరియస్ అయ్యాడు. మా అన్న చనిపోయాడంటారా.. ఈ వార్త వ్యాప్తి చేసిన వాడిని పట్టుకుంటా అంటూ ట్వీట్ చేశాడు. ఈ వార్త తెలిసినప్పుడు తాను విమానంలో ఉన్నానని అతను చెప్పాడు. ఇలాంటి చెత్త వార్తలను సృష్టించిన వారెవరైనా, ఎక్కడున్నా, ఎలాగైనా పట్టుకుంటానని స్పష్టం చేశాడు.
తనపై వచ్చిన అసత్య వార్తలను నమ్మెద్దని, ఈ ఫేక్ వార్తకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నాథన్ మెక్‌కల్లమ్ పేర్కొన్నాడు. బ్రెండన్ మెకల్లమ్ న్యూజిలాండ్ తరఫున 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. మొత్తం కెరీర్‌లో 19 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు చేశాడు.
న్యూజిలాండ్ తరపున నాథన్ మెక్‌కల్లమ్ 84 వన్డేలు, 63 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 2011 సీజన్‌లో పూణె వారియర్స్ తరపున ఆడాడు. 2015లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.