
మాంచెస్టర్: ప‌్రపంచకప్ టోర్నమెంట్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ సంగతేమో గానీ.. మాజీ క్రికెటర్లు మాత్రం ట్వీట్ల యుద్ధానికి దిగుతున్నారు. పరస్పరం హైరేంజ్‌లో ట్వీట్లు సంధిస్తున్నారు. ఓ వైపు టీమిండియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, ఇంగ్లండ్ మాజీ కేప్టెన్ మైఖెల్ వాఘన్ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతుండగానే.. ఇంకో వైపు న్యూజిలాండ్ మాజీ కేప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ కెవిన్ పీటర్‌సన్ మధ్య తాజాగా మాటల యుద్ధం మొదలైంది. సరదాగా ఆరంభమైన ఈ ట్వీట్ల ఫ్రెండ్లీ ఫైటింగ్.. క్రమంగా ఘాటెక్కింది.
250 రన్ల టార్గెట్ ఉన్నా పోరాడవచ్చు..
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో రెండోరోజు ఆట ఆరంభం కావడానికి కొద్దిసేపటి ముందు తమ జట్టును ఉద్దేశించి బ్రెండన్ మెక్ కల్లమ్ ఓ ట్వీట్ చేశారు. ద్వైపాక్షిక సిరీస్ టోర్నమెంట్‌లల్లో ప్రత్యర్థికి 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా సరిపోతుందని అన్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లల్లో ఆ మాత్రం స్కోర్ చేసినా సరిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లలో ఈ స్కోరు సరిపోదని, మరిన్ని పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ ట్వీట్‌పై కెవిన్ పీటర్‌సన్ కౌంటర్ ఇచ్చారు. 250 పరుగులు సరిపోతాయా? అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై కౌంటర్ అటాక్ ఇచ్చారు మెక్ కల్లమ్. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో లీగ్ దశలో కేవలం భారత్, బంగ్లాదేశ్ జట్లు మాత్రమే 250కి పైగా లక్ష్యాన్ని ఛేదించాయని కెవిన్‌కు గుర్తు చేశారు. సెమీఫైనల్ మ్యాచ్ అంటే ప్రెషర్ కుక్కర్‌లో ఉన్నట్టు ఉంటుందని, అలాంటి సమయంలో 250 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడం సులువు కాదని అన్నారు.