న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ట్వీట్ చేసి నవ్వులు పూయించాడో మాజీ క్రికెటర్. బ్రెండన్ టేలర్... జింబాబ్వే జట్టు మాజీ కెప్టెన్‌గా, పలుమార్లు భారత్‌కు వచ్చి ఇక్కడి అభిమానులను ఎంతగానో అలరించాడు.
తన కుటుంబ అవసరాల నిమిత్తం 29వ ఏటనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్, ఆదివారం నాడు ధోనిని ఉద్దేశించి చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి వన్డే కెప్టెన్ ధోని గతేడాది డిసెంబర్‌లో తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో ధర్మశాలలో తొలి వన్డేలో ధోని ఆడే క్రమంలో ఆ మ్యాచ్ ని టెస్టు మ్యాచ్ గా అనుకున్నాడేమో, "ధోనీ టెస్టుల నుంచి వైదొలగాడని నేను అనుకున్నాను" అని ట్వీట్ చేశాడు.
మరోవైపు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 3-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇండోర్‌లో జరిగిన చివరి టెస్టులో న్యూజిలాండ్‌పై టీమిండియా 321 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అనంతరం తిరిగి 'ఇంకా ధోనీ ఆడుతున్నాడు. ఇదే అతనికి ఆఖరి టెస్టా?' అని అర్థం వచ్చేలా మరో ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో తన తప్పు తెలుసుకుని "నా మైండ్ పోయింది" (లూజింగ్ మై మైండ్) అని క్షమాపణలు చెప్పాడు. టేలర్ తొలి ట్వీట్ అర్థం కాక, ఎంతో మంది అతన్ని ప్రశ్నలతో ముంచెత్తారు.
చివరికి "నేను నా కుటుంబంతో కలసి ఓ బీచ్‌లో ఉన్నాను. క్రిక్ ఇన్ఫోలో ధోనీ ఆడుతున్నాడని చూశాను. అది వన్డే అని తెలుసుకోలేకపోయాను. మరో టెస్టును ఆడుతున్నాడని భావించాను" అని వివరణ ఇచ్చాడు.
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ధర్మశాలలో జరిగిన తొలివన్డేలో టీమిండియా న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టుసిరిస్‌లో న్యూజిలాండ్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించిన సంగతి తెలిసిందే.