ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ మిఛెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు. టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి వైదొలిగాడు. ఈ ఫార్మట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్స్ లో కొనసాగుతానని వెల్లడించాడు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశాడు స్టార్క్.
కేరీర్ లో ఇప్పటివరకు మొత్తం 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడీ 35 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం పేసర్. 73 వికెట్లు పడగొట్టాడు. 2021లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టీ20 ఇంటర్నేషనల్స్ కు దూరం అయ్యాడు. తాజాగా ఈ ఫార్మట్ నుంచి తప్పుకొంటోన్నట్లు వెల్లడించాడు. దీనికి గల కారణాలను వివరించాడు.

భారత్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ తో పాటు యాషెస్, 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని- టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించాడు మిఛెల్ స్టార్క్. వన్డేలు, టెస్ట్ ఫార్మట్ పై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2027 వరకు కొనసాగాలంటే శరీరాన్ని ఫిట్‌గా, అలసిపోకుండా ఉండాలంటే ఇది తప్పదని అభిప్రాయపడ్డాడు.
2026 నుంచి తీరికలేని షెడ్యూల్ ను ఎదుర్కొనాల్సి ఉంది ఆస్ట్రేలియాకు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్, దక్షిణాఫ్రికా పర్యటన, న్యూజిలాండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఉన్నాయి. 2027 జనవరిలో అయిదు టెస్ట్‌ల కోసం భారత్‌లో పర్యటిస్తుంది ఆసీస్. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్ట్, 2027 మధ్యలో యాషెస్ సిరీస్ ఉంటాయి. అదే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆడాల్సి ఉంది.